కేసీఆర్‌ ఫాంహౌస్‌ను వెయ్యి నాగళ్లతో దున్నేస్తాం

తెలంగాణ ప్రభుత్వం అన్ని పంటలతో పాటు వరి, మొక్కజొన్నను కొనుగోలు చేయకుంటే రైతులతో కలిసి సీఎం కేసీఆర్‌ ఫాంహౌస్‌ను వెయ్యి నాగళ్లతో దున్నేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ హెచ్చరించారు. పంటలకు మద్దతు ధర ఇవ్వకుంటే ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు అన్నదాతలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 
 
బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 25వ రోజైన మంగళవారం కామారెడ్డికి చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. నిజాంసాగర్‌ చౌరస్తాకు చేరుకోగానే 300 కి.మీ. పూర్తయినట్టు నేతలు ప్రకటించారు. ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలు నినాదాలు, చప్పట్లతో సంజయ్‌ను అభినందించారు.     
 
అధికారంలోకి వస్తే నిజాం షుగర్‌ కర్మాగారాన్ని తెరిపిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్‌.. ఇప్పటి వరకు ఎందుకు తెరవడం లేదో రైతులకు సమాధానం చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. బెల్లంపై కేసీఆర్ ఆంక్షలు పెట్టారని..సీఎం మూర్ఖపు విధానాలతో రైతులు చెరుకు సాగు మానేశారని ఆరోపించారు. వరి వేస్తే ఉరేనని, మొక్కజొన్న వేస్తే రైతు బంధు ఇవ్వబోమని.. చెరకు పంటకు మద్దతు ధర ప్రకటించకుండా కేసీఆర్‌ రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. 
 
కామారెడ్డి జిల్లాకు కాళేశ్వరం నీళ్లు తీసుకువస్తానని ఏడేళ్ల క్రితం 21వ ప్యాకేజీ పనులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రీడిజైన్‌ చేసినా.. ఇప్పటికీ పనులు పూర్తికాలేదని గుర్తు చేశారు. 21వ ప్యాకేజీలో కేసీఆర్‌కు కమీషన్లు రాకపోవడంతోనే పనులు ముందుకు సాగడం లేదని ఆరోపించారు. డ్రగ్స్‌ చాలెంజ్‌ పేరుతో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు కొత్త నాటకానికి తెర లేపారని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర నుంచి ప్రజల దృష్టి మార్చేందుకే ఇరు పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు.
 
కాగా, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తెలిపారు. పాదయాత్రలో భాగంగా కామారెడ్డి సభలో ఆయన ప్రసంగీస్తూ మోదీ ప్రభు త్వం ఉపాధి హామీ పనులు, జాతీయ రహదారులు, ఇళ్ల నిర్మాణాలు, గ్రామాల అభివృద్ధి..ఇలా అనేక పథకాల కింద రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తోందని పేర్కొన్నారు.  గత ఏడేళ్లలో రాష్ట్రంలో లక్ష మంది ఉద్యోగులు రిటైర్‌కాగా, టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం మాత్రం ఆ ఖాళీలను భర్తీ చేయలేదని ఆరో పించారు.