పెగాసస్‌ పై సాంకేతిక నిపుణుల కమిటీ

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్‌ వివాదంపై విచారణకు సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు ప్రకటిచింది. ఈ మేరకు వచ్చే వారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ గురువారం తెలిపారు. 
 
కేసు విచారణ సందర్భంగా పిటిషన్‌దారుల తరుపు న్యాయవాది చందర్‌ఉదరు సింగ్‌తో జస్టిస్‌ ఎన్‌వి రమణ ఈ విషయాన్ని తెలిపారు. ఈ వారానికి కన్నా ముందు ఈ అంశంపై ఉత్తర్వులు పాస్‌ చేయాలనుకున్నామని, నిపుణుల కమిటీ కోసం కొంత మంది సభ్యులను పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. 
 
అయితే వ్యక్తిగత కారణాల వల్ల వారు ఈ కమిటీలో భాగం కావడానికి నిరాకరించారని, అందుకే ఆలస్యమైనట్లు తెలిపారు. వచ్చే వారం పెగాసెస్‌పై ఉత్తర్వులు చేయడానికి ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. పెగాసస్‌ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సెప్టెంబర్‌ 13న విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు … మధ్యంతర ఉత్తర్వులు రిజర్వు చేసిన సంగతి విదితమే. 
 
ఇజ్రాయిల్‌ సంస్థ ఎన్‌ఎస్‌ఒ సంస్థ అభివృద్ధి చేసిన పెగాసస్‌ అనే స్పైవేర్‌ ద్వారా నిఘాలో దాదాపు 300 భారతీయ మొబైల్‌ఫోన్లు ఉన్నాయని అంతర్జాతీయ మీడియా కన్సార్టియం ఇటీవల రిపోర్టుచేసింది. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఇద్దరు కేంద్ర మంత్రులు-ప్రహ్లాద్ సింగ్ పటేల్, రైల్వే, ఐటి శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, వ్యాపారవేత్త అనిల్ అంబానీ, ఓ మాజీ సిబిఐ చీఫ్, కనీసం 40 మంది జర్నలిస్టులు లీక్ అయిన ఎన్‌ఎస్‌ఒ డేటాబేస్‌లో ఉన్నాయని సమాచారం.
అయితే వారందరి ఫోన్లు హ్యాక్ అయ్యాయా అన్నది ఇంకా ధృవపడలేదు. కోర్టు ఆదేశిస్తే నిపుణుల కమిటీతో విచారణ జరిపిస్తామని, కానీ ఫోన్లపై నిఘాపెట్టడానికి పెగాసస్, ఇతరత్రా సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగిస్తున్నామో లేదో చెప్పే అఫిడవిట్‌ను దాఖలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రత పేరిట మరోసారి విముఖత చూపింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు ముందు హాజరై ఈ విషయాన్ని తెలిపారు. 
భారత్‌లోని కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష, ప్రముఖలు ఫోన్లపై కేంద్రం నిఘా పెట్టిందన్న ఆరోపణలపై సుప్రీంకోర్టులో సీనియర్‌ జర్నలిస్టులతో పాటు పలువురు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి విదితమే.