రెమాల్‌ తుఫాన్‌ తో కోల్‌కతా పోర్ట్‌ మూసివేత

రెమాల్‌ తుఫాన్‌ పశ్చిమ బెంగాల్‌ను వణికిస్తున్నది. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కోల్‌కతాలోని శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ పోర్టుని మూసివేయనున్నది. అన్ని కార్గో షిప్‌, కంటైనర్‌ సంబంధిత కార్యకలాపాలను ఆదివారం సాయంత్రం నుంచి 12 గంటల పాటు మూసివేయనున్నాయి. 
 
ఓడరేవులో పనిచేస్తున్న ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోల్‌కతా పోర్ట్ చైర్మన్ రతేంద్ర రామన్ తెలిపారు.  తుఫాను ప్రభావం, ఇందుకు సంబంధించిన సన్నాహాలను పరిశీలించారు. తుఫాను నుంచి రక్షణ కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సమావేశంలో అధికారులను కోరారు. పోర్ట్ వద్ద రైల్వే కార్యకలాపాలు సైతం నిలిసివేయనున్నారు. 
 
బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్‌ తుఫాన ఆదివారం రాత్రి బంగాళాఖాతం తీరాన్ని దాటే అవకాశం ఉన్నది. పశ్చిమ బెంగాల్‌, బంగ్లా మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అంచనా వేసింది. తుఫాను నేపథ్యంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయి. 
 
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాతావరణ శాఖ ప్రకారం.. తుఫాను ఈ నెల 26 రాత్రి బెంగాల్, బంగ్లాదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉన్నది. ఈ పరిస్థితుల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు ఆదేశించారు. రెమాల్‌ తుఫాను ప్రభావంతో బెంగాల్‌తో పాటు ఉత్తర ఒడిశా ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. 
 
యూపీ, బిహార్‌లోని పలు ప్రాంతాల్లోనూ వానలు పడుతాయని తెలిపింది. రెమాల్ తుఫాను నేపథ్యంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని.. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ అధికారి జహీర్‌ అబ్బాస్‌ పేర్కొన్నారు. తుపానును ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నామన్నారు.