మ‌త‌మార్పిడి నిరోధ‌క బిల్లుకై కర్ణాటక కసరత్తు

మ‌త‌మార్పిడి నిరోధ‌క బిల్లును తీసుకువ‌చ్చేందుకు క‌స‌ర‌త్తు సాగిస్తున్నామ‌ని క‌ర్ణాట‌క హోంమంత్రి అర‌గ జ్ణానేంద్ర  వెల్ల‌డించారు. ఈ త‌ర‌హా చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చిన ఇత‌ర రాష్ట్రాల్లో చ‌ట్ట నిబంధ‌న‌ల‌ను ప‌రిశీలించి బిల్లును ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని రాష్ట్ర శాసనసభలో ఆయ‌న చెప్పారు. 

ఈ విషయమై పలువురు సభ్యులు వ్యక్తం చేసిన ఆందోళనలను ప్రస్తావిస్తూ కేవలం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా, దేశ వ్యాప్తంగా కూడా మతమార్పిడులు తీవ్రమైన సమస్యగా నెలకొన్నట్లు తనకు తెలుసని మంత్రి తెలిపారు. ఆ విధంగా మతమార్పిడులకు పాల్పడుతున్నవారికి విస్తృతమైన నెట్ వర్క్ ఉన్నట్లు చెప్పారు.  

ప్రలోభాలతో ఒకరిని మతం మార్చడం శిక్షార్హనేరమని ఆయన స్పష్టం చేశారు. స్వచ్ఛందంగా ఎవరైనా మతం మారవచ్చని, కానీ అందుకు అనారోగ్యంతో ఉన్నవారికి నయం చేస్తామని లేదా మరేదైనా మతపరమైన ప్రలోభాలు కలిగించడం భావ్యం కాదని స్పష్టం చేశారు. అటువంటి చర్యలు మత సామరస్యానికి కూడా విఘాతం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇటువంటి దురాచారాన్ని కట్టడి చేయడం గురించి రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నది హోమ్ మంత్రి చెప్పారు. అయితే అందుకు ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకు రావాలా లేదా మరోవిధంగా చేయవచ్చా అని పరిశీలిస్తున్నామని తెలిపారు. క‌ర్ణాట‌క‌లో మ‌త‌మార్పిడులు ముమ్మ‌రంగా సాగుతున్నాయ‌ని, త‌న త‌ల్లి మ‌తం మారి క్రైస్త‌వం స్వీక‌రించింద‌ని ఎమ్మెల్యే గూలిహ‌ట్టి శేఖ‌ర్ పేర్కొన్న క్ర‌మంలో మ‌త మార్పిళ్ల‌ను నిలువ‌రించేందుకు చ‌ట్టం తీసుకురావాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తోంద‌ని మంత్రి తెలిపారు.

కాగా, త‌న త‌ల్లికి కొంద‌రు నూరిపోసి క్రైస్త‌వంలోకి మార్పించార‌ని ఎమ్మెల్యే శేఖ‌ర్ చెప్పుకొచ్చారు. హోస‌దుర్గ నియోజ‌క‌వ‌ర్గంలో క్రైస్త‌వ మిష‌న‌రీలు పెద్ద ఎత్తున మత‌మార్పిళ్ల‌కు పాల్ప‌డుతున్నాయ‌ని, దాదాపు 18,000 నుంచి 20,000 మంది వ‌ర‌కూ హిందువుల‌ను మిష‌న‌రీలు క్రైస్త‌వ మ‌తంలోకి చేర్పించాయ‌ని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 

త‌న త‌ల్లి మ‌తం మారేలా చేసిన మిష‌న‌రీలు ఆమెను నుదుటిపై కుంకుమ పెట్టుకోవ‌ద్ద‌ని కోరాయ‌ని చెప్పారు.ఆమె ఫోన్ రింగ్‌టోన్‌ను కూడా క్రైస్త‌వ ప్రార్ధ‌న‌ల‌తో మార్చేశార‌ని తెలిపారు. ఇంట్లో పూజ చేయాల‌న్నా ఇబ్బందిక‌రంగా ఉంద‌ని, త‌ల్లికి ఏదైనా చెప్పినా ఆమె త‌నువు చాలిస్తాన‌ని అంటోద‌ని ఆయ‌న వాపోయారు.

రాష్ట్రంలో మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం తీసుకురావడానికి ముందు గ్రామాలలో ప్రజలు చిన్న చిన్న సమస్యలు, రోగాలకు గ్రామ  దేవతల వద్దకు వెళ్లేవారని, కానీ ఇప్పుడు అటువంటి వారిని క్రైస్తవ మిషనరీలు ప్రలోభాలకు గురిచేసి, మతమార్పిడులకు దోహాసం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.  దళితులు, ఓబీసీలు, చివరకు ముస్లింలు కూడా మతమార్పిడులకు గురవుతున్నారని చెబుతూ ఎవ్వరికైనా మతం మార్చుకొనే హక్కు ఉన్నదని, అయితే మతం మారడంతో పాటు వారు ఎస్సి, ఎస్టీ హోదాను కూడా కొల్పాతారని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఎస్సి, ఎస్టీ కాలనీలలో మత మార్పిడులు తీవ్రమైన సమస్యగా ఉన్నట్లు మాజీ స్పీకర్ కేజీ బోపయ్య కూడా ఆందోళన వ్యక్తం చేశారు.  ఉత్తర ప్రదేశ్ తరహాలో మతమార్పిడి వ్యతిరేక చట్టం తీసుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. విజయపురి తన స్వస్థలమని చెబుతూ అక్కడ 3.5 లక్షల మంది బంజారా ప్రజానీకం ఉన్నారని శాసనసభ్యుడు దేవానంద్ ఫులాసింగ్ చవాన్ తెలిపారు. అక్కడ చర్చి లు ప్రత్యక్షమైన తండాలలో మతమార్పిడులకు పాలపడుతూ ఉండడంతో బంజారా ప్రజల మధ్య చీలిక ఏర్పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

సభ్యుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అటువంటి బిల్ తీసుకు రావాలని స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కెగిరి ప్రభుత్వానికి సూచించారు. ఇప్పటికే అటువంటి పలు రాష్ట్రాలలో తీసుకు వచ్చిన అటువంటి చట్టాలు ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఉపయోగపడగలవని ఆయన పేర్కొన్నారు.