కెన‌డా ఎన్నిక‌ల్లో 17 మంది భార‌త సంత‌తి ఎంపీల విజ‌యం

కెన‌డా ప్ర‌ధానిగా మూడ‌వ‌సారి జ‌స్టిన్ ట్రూడో ఎన్నిక‌య్యారు. లిబ‌ర‌ల్ పార్టీ మెజార్టీ సాధించకున్నా  ఆ పార్టీయే అధికారాన్ని చేప‌ట్ట‌నున్న‌ది. అయితే ఈసారి కెన‌డా పార్ల‌మెంట్‌ ఎన్నిక‌ల్లో 17 మంది భార‌తీయ సంత‌తి వ్య‌క్తులు ఎంపీలుగా ఎన్నిక‌య్యారు. 

కెన‌డా ప్ర‌ధానిగా మూడ‌వ‌సారి జ‌స్టిన్ ట్రూడో ఎన్నిక‌య్యారు. తాజా ఎన్నిక‌ల్లో తామే గెలిచిన‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. కెన‌డాలో తాము ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోనున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. లిబ‌ర‌ల్ పార్టీ త‌ర‌పున ట్రూడో ప్ర‌ధాని అభ్య‌ర్థిగా పోటీలో నిలిచారు. క‌న్జ‌ర్వేటి పార్టీ నుంచి ఆయ‌న‌కు గ‌ట్టి పోటీ ఇచ్చింది. లిబ‌ర‌ల్ పార్టీ అత్య‌ధిక సీట్లు గెలిచినా.. సంపూర్ణ మెజారిటీని సాధించ‌లేక‌పోయింది. 

అయితే ట్రూడో త‌న అధికారాన్ని నిల‌బెట్టుకున్నారు. దివ్య‌మైన భ‌విష్య‌త్తును ఎన్నుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. కోవిడ్‌పై పోరాటాన్ని ముగిస్తామ‌ని పేర్కొన్నారు. కెన‌డాను ముందుకు తీసుకువెళ్ల‌నున్న‌ట్లు ట్రూడో తెలిపారు. జ‌గ్‌మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్ర‌టిక్ పార్టీ 27 సీట్లు గెలిచి కీల‌కంగా మారింది. జ‌గ్‌మీత్ మ‌ద్ద‌తులోనే ట్రూడో కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. మాజీ మంత్రులు టిమ్ ఉప్ప‌ల్‌, హ‌ర్జిత్ సింగ్ స‌జ్జ‌న్‌, బర్దిశ్ చాగ‌ర్‌, అనితా ఆనంద్‌లు కూడా మ‌ళ్లీ ఎన్నిక‌య్యారు. 

వాంకోవ‌ర్ నుంచి ర‌క్ష‌ణ మంత్రి హ‌ర్జిత్ సింగ్ స‌జ్జ‌న్ రెండోసారి గెలిచారు. వాట‌ర్‌లూ సీటు నుంచి ఛాగ‌ర్ విజ‌యం సాధించారు. బ్రిటీష్ కొలంబియా నుంచి సుఖ్ ద‌లివాల్‌, స‌ర్రీ సెంట‌ర్ నుంచి ర‌ణ్‌దీప్ సింగ్ సారాయి గెలిచారు.

 క్యుబెక్ నుంచి ఇండో కెన‌డియ‌న్ అంజూ ధిల్లాన్ మ‌రోసారి ఎంపీ అయ్యారు. కాల్గ‌రి ఫారెస్ట్ లాన్ స్థానం నుంచి జ‌స్‌రాజ్ సింగ్ హ‌ల్ల‌న్ విక్ట‌రీ కొట్టారు. ఎడ్మంట‌న్ మిల్ వుడ్స్ నుంచి ఉప్ప‌ల్ మ‌రోసారి గెలుపొందారు.  ఒంటారియాలో న‌లుగురు సిట్టింగ్ ఇండో కెన‌డియ‌న్లు విజ‌యం సాధించారు. ఎంపీలు మ‌ణింద‌ర్ సిద్దూ, రూబీ స‌హోటా, సోనియా సిద్దు, క‌మ‌ల్ ఖేరాలు గెలిచారు. నేపియ‌న్ సీటు నుంచి చంద్ర ఆర్యా విజ‌యం సాధించారు.

ప్ర‌భుత్వ ఏర్పాటుకు మెజారిటీ 170 సీట్లు కావాలి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. లిబ‌ర‌ల్ పార్టీ 157 సీట్ల‌లో విజ‌యం సాధించింది. ఇక క‌న్జ‌ర్వేటి పార్టీ 122 స్థానాల‌ను కైవ‌సం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. దేశ‌వ్యాప్తంగా దాదాపు 95 శాతం ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. 

నిజానికి మైనార్టీ ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్న ట్రూడో.. గ‌త ఆగ‌స్టులో మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించారు. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండేళ్ల‌కే ఆయ‌న ఎన్నిక‌ల‌కు పిలుపునిచ్చారు. అయితే ఈసారి కూడా గెలిచినా.. ట్రూడో మాత్రం తాను అనుకున్న‌ట్లు మెజారిటీ సాధించ‌లేక‌పోయారు.

కెన‌డా చరిత్ర‌లోనే ఇది అత్యంత ఖ‌రీదైన ఎన్నిక‌లుగా చెబుతున్నారు. 2019లో గెలిచిన సీట్ల‌తో పోలిస్తే, ఈ సారి మూడు సీట్ల‌ను లిబ‌ర‌ల్ పార్టీ కోల్పోయింది.