పాక్ తాలిబాన్ జెండాలు ఎగరడంతో చిక్కుల్లో ఇమ్రాన్ ఖాన్ 

ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్‌ తో పాటు ఆ దేశంలో నెలకొన్న ఉగ్రవాద ముఠాలకు  మద్దతు ఇవ్వడం ద్వారా ప్రపంచంలో ఒంటరైన పాకిస్తాన్ ఇప్పుడు స్వదేశంలో తాలిబన్ జెండాలు ఎగరడం, ఆఫ్ఘన్ తాలిబన్ల వశం కావడంతో పలుచోట్ల సంబరాలు జరుపుకోవడంతో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చిక్కుల్లో పడుతున్నట్లు కనిపిస్తున్నది. 

ఆదివారం ఇస్లామాబాద్‌లోని జామియా హఫ్సా మదర్సాలో తాలిబాన్ జెండాలు రెపరెపలాడాయి. అపవాదు భయంతో భయాందోళనకు గురైన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తాలిబాన్‌ జెండాలను తొలగించడానికి పోలీసులను పంపినప్పటికీ.. ఖాళీ చేతులతో తిరిగి రావాల్సి వచ్చింది. మదర్సా నిర్వాహకుడు మౌలానా అబ్దుల్ అజీజ్ పోలీసులను బెదిరించినట్లు తెలుస్తున్నది.

పోలీసులు వచ్చే సమయానికి అజీజ్‌ చేతిలో ఏకే 47 తుపాకీతో దర్శనమిచ్చినట్లుగా ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పెద్ద సంఖ్యలో విద్యార్థులు మదర్సా టెర్రస్‌పై తాలిబాన్‌ జెండాలు ఎగురవేసి నినాదాలు చేశారు. ఈ ఘటన అనంతరం అబ్దుల్‌ అజీజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆ జెండాలను దించివేశారు. 

గత నెల 15 న కాబూల్‌ను తాలిబాన్‌ స్వాధీనం చేసుకోగానే  పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌తో పాటు అనేక ప్రాంతాల్లో తాలిబాన్ జెండాలు ఎగురవేసి, ర్యాలీలు నిర్వహించారు. ఈ సంఘటనలను మీడియా కవర్ చేసింది. దాంతో తాలిబాన్‌కు ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం మద్దతు ఇస్తుందన్న ఆరోపణలకు బలం చేకూర్చినట్లయింది. 

ఇస్లామాబాద్ నగరం నడిమధ్యలో ఉన్న జామియా హఫ్సా టెర్రస్‌పై తాలిబాన్ జెండాలు ఊపుతూ మతోన్మాదులు మళ్లీ కనిపించారు. పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి జెండాలను దించమనగా.. అందుకు వారు నిరాకరించారు. పోలీసులతో మదర్సా నిర్వాహకుడు అజీజ్‌ గొడవపడి బహిరంగంగా బెదిరించినట్లు తెలుస్తున్నది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘తప్పులు జరిగే చోట మీరుండాలి. అంతేకానీ, పిల్లలను భయపెట్టడానికి మదర్సాలకు రావద్దు. ఇక్కడ చర్యలు తీసుకోవడానికి ముందుకొస్తే ఫలితం మాత్రం చాలా చేదుగా ఉంటుంది’ అని చెప్పినట్లు ఆ వీడియోలో వినిపిస్తున్నది. పైగా,  “మీరు ఇలాగే వ్యవహరిస్తే పాకిస్తాన్ తాలిబాన్‌ మీకు గుణపాఠం నేర్పడం ఖాయం” అని కూడా హెచ్చరించాడు.