రష్యా యూనివర్సిటీలో కాల్పులు… 10 మంది మృతి

ర‌ష్యాలో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌ వేళ ర‌క్తం పారింది. ఆ దేశానికి చెందిన పెర్మ్ న‌గ‌రంలో జ‌రిగిన కాల్పుల్లో అనేక మంది మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది. ఓ యూనివ‌ర్సిటీ క్యాంప‌స్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కాల్పులకు పాల్ప‌డిన దుండ‌గుడిని ప‌ట్టుకున్నారు. 
 
ఓ బిల్డింగ్ నుంచి అనేక మంది విద్యార్ధులు భ‌యంతో పారిపోతున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైర‌ల్‌ అయ్యాయి. పెర్మ్ స్టేట్ యూనివ‌ర్సిటీలో కాల్పుల ఘ‌ట‌న జ‌రిగింది. ఇది అత్యంత ఓల్డ్‌ యూనివ‌ర్సిటీ. వీలైతే క్యాంప్‌ను వ‌దిలి వెళ్లండి లేదా రూమ్‌ల్లోనే తాళాలు వేసుకుని ఉండాల‌ని ఇవాళ ఉద‌యం యూనివ‌ర్సిటీ ఓ అల‌ర్ట్ ఇచ్చింది. 
 
పెర్మ్ న‌గ‌రంలో ఉన్న వైద్య అధికారులు సుమారు 10 మంది మృతిచెందిన‌ట్లు తెలిపారు. ఇంకా ఎక్కువ సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌వించి ఉంటాయ‌ని పోలీసులు భావిస్తున్నారు.
 
యూనివర్సిటీ భవనంలోకి చొరబడిన సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్పులకు భయపడిన కొందరు విద్యార్ధులు యూనివర్సిటీ ఆడిటోరియంలో దాక్కున్నారు. మరికొందరు కిటికీల ద్వారా తప్పించుకునేందుకు యత్నిస్తూ భవనంపై నుంచి దూకేశారు.
 
యూనివ‌ర్సిటీ విద్యార్ధే కాల్పులు జ‌రిపిన‌ట్లు అనుమానిస్తున్నారు. 18 ఏళ్ల తైముర్ బెక్మాన్సువ‌ర్‌గా గుర్తించారు. త‌న ప్లాన్ గురించి అత‌ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేసిన‌ట్లు తెలుస్తోంది. పోలీసులు జ‌రిపిన ఫైరింగ్‌లో అత‌ను గాయ‌ప‌డిన‌ట్లు చెబుతున్నారు.