శరద్‌ పవార్‌ వెన్నుపోటుదారు…. కాదు కాదు సర్కార్ కు పిల్లర్

శరద్‌ పవార్‌పై రాయగడ మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అనంత్ గీతే చేసిన విమర్శలు  మ‌హారాష్ట్ర సంకీర్ణ స‌ర్కారులో క‌ల‌క‌లం రేపాయి. ఈ నేప‌థ్యంలో శివ‌సేన ఎంపీ, ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి సంజ‌య్ రౌత్‌ న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టారు. కూటమి ప్రభుత్వాన్ని తెరవెనుక ఉంది  పవర్ నడిపిస్తున్నారని వస్తున్న ఆరోపణల పట్ల శివసేన నేతలలో అసహనం ఈ సందర్భంగా వ్యక్తం అవుతున్నది.

కాంగ్రెస్‌కు ఆయన వెన్నుపోటు పొడిచి నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)ని ఏర్పాటు చేశారని అనంత్ గీతే   ఆరోపించారు. అలాంటి వ్యక్తి శివసైనికులకు ఏనాటికీ గురువు కాలేరని స్పష్టం చేశారు. ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న మహా వికాస్‌ అఘాది ప్రభుత్వం ‘సర్దుబాటు’ మాత్రమే అని అనంత్‌ గీతే రాయగడలో నిర్వహించిన బహిరంగసభలో బాంబు పేల్చారు.

అయితే కొద్దీ సేపటికే, అనంత్ గీతే ఏం మాట్లాడారో త‌న‌కు తెలియ‌ద‌ని, అయినా ఆయ‌న‌ వ్యాఖ్య‌ల‌తో పార్టీకి ఎలాంటి సంబంధం లేద‌ని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. అనంత్ గీతే వ్యాఖ్య‌లు ఆయ‌న వ్యక్తిగ‌త అభిప్రాయం మాత్ర‌మేన‌ని చెప్పారు. ఎన్‌సీపీ అధ్య‌క్షుడు శ‌ర‌ద్‌ప‌వార్ ఒక పెద్ద నాయ‌కుడ‌ని, మ‌హారాష్ట్ర సంకీర్ణ స‌ర్కారులో ఆయ‌నే మూల‌స్తంభ‌మ‌ని సంజ‌య్ రౌత్ పేర్కొన్నారు

శివసేన-బీజేపీ మధ్య విభేదాల తర్వాత 2019 లో మహా వికాస్‌ అఘాది ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంతకుముందు బీజేపీతో కలిసి శివసేన అధికారాన్ని పంచుకున్నది. ‘ఇప్పుడున్న ప్రభుత్వం సర్దుబాటు మాత్రమే. అయినందున శరద్ పవార్ మా నాయకుడు కాలేడు. మా గురువు ఎప్పటికీ బాలాసాహెబ్ ఠాక్రేనే’ అని అనంత్ గీతే తేల్చి చెప్పారు.

ఈ ప్రభుత్వం పనిచేస్తున్నంత కాలం మూడు పార్టీల మధ్య సర్దుబాటు కొనసాగుతుందని తెలిపారు. సేన నేతృత్వంలోని ప్రభుత్వంపై తనకు ఎలాంటి దురుద్దేశాలు లేవని, ఈ ప్రభుత్వం విజయవంతం అవుతుందని అనంత్‌ గీతే పేర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థి సునీల్‌ తత్కరే చేతిలో స్వల్ప తేడాతో అనంత్‌ గీతే ఓటమిపాలయ్యారు.