కర్ణాటకలో మతపరమైన నిర్మాణాల రక్షణ బిల్లు

కర్ణాటకలో అన్ని మతాలకు చెందిన మతపరమైన నిర్మాణాలకు రక్షణ కల్పించాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని మతపరమైన నిర్మాణాల రక్షణ బిల్లు-2021 ని కర్నాటక ప్రభుత్వం తీసుకురానున్నది. ఈ మేరకు బిల్లును ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 

మతపరమైన స్థలాల తొలగింపునకు సంబంధించి ఏదైనా కేసు న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంటే రాష్ట్రం రక్షణ కల్పించదని బిల్లులో పేర్కొన్నారు. రక్షిత నిర్మాణాల్లో మతపరమైన కార్యకాలపాలు.. ఆచారం, చట్టం, వినియోగానికి లోబడి ఉంటాయని కూడా స్పష్టం చేసింది.

ఇటీవల మైసూర్‌లోని నంజన్‌గూడలో ఓ ఆలయం కూల్చివేత నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువస్తున్నది. మత సామరస్యాన్ని కాపాడుతూ ప్రజల మత భావాలను దెబ్బతినకుండా ఉండేందుకు ఈ చట్టం అమలులోకి రావడానికి ముందు బహిరంగ ప్రదేశాల్లో నిర్మించిన మతపరమైన నిర్మాణాలకు రక్షణ కల్పించడం అవసరమని ప్రభుత్వం భావిస్తున్నది. 

భవిష్యత్‌లో బహిరంగ ప్రదేశాల్లో అనధికార మతపరమైన నిర్మాణాలను పరిమితం చేసేందుకు ఈ చట్టం వీలుకల్పిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో అనధికార మత పరమైన నిర్మాణాలకు అధికారులు ఇకపై అనుమతి ఇవ్వరని పేర్కొన్నది.