మహంత్ నరేంద్ర గిరి అనుమానాస్పద మృతి

అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి మహరాజ్ సోమవారంనాడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన భౌతికకాయం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో ఉన్న బాఘంబరి మఠంలో కనుగొన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆయన ఉరి వేసుకున్నట్టు తెలుస్తోంది. 

5 పేజీల సూసైడ్ నోట్‌ను కూడా కనుగొన్నారు. తన శిష్యులలో ఒకరైన ఆనంద్ గిరి ఇందుకు బాధ్యుడుగా మహంత్ నరేంద్ర గిరి అందులో పేర్కొన్నట్టు కూడా తెలుస్తోంది. ఫోరెన్సిక్ బృదంతో పాటు ఒక ప్రత్యేక బృందం ఘటనా స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించింది.

కాగా, మహంత్ నరేంద్ర గిరి ఇక లేరనే వార్త విషాదం నింపినట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఒక ట్వీట్‌లో సంతాపం తెలిపారు.  విభిన్న సంత్ వర్గాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఆయన జీవితాంతం పాటుపడ్డారని, ఓం శాంతి అంటూ ప్రధాని మోదీ కొనియాడారు. ఆధ్యాత్మిక సాంప్రదాయాలకు కట్టుబడి ఉన్నారని, ఆయన అకాలమరణం బాధాకరం అని తెలిపారు. 

మహంత్ నరేంద్ర గిరి మరణం పట్ల ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరుపుతామని శర్మ హామీ ఇచ్చారు.

మహంత్ నరేంద్ర గిరి మృతిపై ముందుగా స్పందించిన వారిలో సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఉన్నారు. నరేంద్ర గిరి స్వామీజీ మరణం తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి, ఆయన శిష్యులకు మనోనిబ్బరం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. హోమ్ మంత్రి అమిత్ షా, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లతో పాటు పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు.

కాగా, మమంత్ నరేంద్ర గిరి ఈ ఏడాది జూలైలో కరోనా పాజిటివ్‌తో రిషీకేష్‌లోని ఎయిమ్స్‌లో చికిత్స పొందారు. స్వస్థత చేకూరిన తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మహంత్ ఆత్మహత్యకు ప్రేరేపించాడనే ఆరోపణతో ఆయన శిష్యుడు ఆనంద్ గిరిని ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆశ్రమంలో కోట్లాదిరూపాయలను మోసం చేసిన కొందరు వ్యక్తుల పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అఖిల భారతీయ అఖాడా పరిషత్ భారతదేశంలో సాధువుల అతిపెద్ద సంస్థ.