బిజెపి ఉపాధ్యక్షులుగా బేబీ రాణి, దిలీప్ ఘోష్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో అధికారంలోకి రావడానికి చేసిన ప్రయత్నం  ఫలించక పోవడంతో పాటు వరుసగా పార్టీ నేతలు అధికార టిఎంసిలో చేరే ప్రయత్నం చేస్తున్నందున అక్కడ పార్టీ ప్రక్షాలను బిజెపి అధిష్ఠానం కసరత్తు చేపట్టింది. 

రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న దిలీప్ ఘోష్ ను జాతీయ ఉపాధ్యక్షునిగా నియమించింది. ఆయన పార్టీ ఎంపీ కూడా. గత మార్చ్ – ఏప్రిల్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బెంగాల్ లో పార్టీకి ఆయనే సారధ్యం వహించారు. ఇటీవలనే ఉత్తరాఖండ్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన బేబీ రాణి మౌర్యను కూడా పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా నడ్డా నియమించారు. 

294 మంది శాసనసభ్యులున్న రాష్త్ర శాసనసభలో 77 మందిని బిజెపి గెల్చుకోగలిగినా, ఇప్పటికే ఎమ్యెల్యేల వలస కారణంగా ఆ సంఖ్య 71కు పడిపోయింది. తాజాగా మాజీ కేంద్ర  మంత్రి, ఎంపీ బాబుల్ సుప్రియో టిఎంసిలో చేరారు. 

బాలురఘాట్ ఎంపీ సుకంతా మజుందార్ ను బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా నియమించారు. 41ఏళ్ల సుకాంత మజుందార్.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రచారక్‌గా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. 2014లో ఆయన బీజేపీలో చేరారు.

2019లో బీజేపీ తరఫున బలూర్‌ఘాట్ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి మొదటిసారిగా ఎంపీగా గెలుపొందారు. సెప్టెంబర్ 30న భవానీపూర్‌తో పాటు సంసర్‌గంజ్, జంగిపూర్ అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ ఉప ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలను సుకాంతకు ఇటీవల అప్పగించారు.