అంతుబట్టని సోనూసూద్ ఆర్ధిక లావాదేవీలు!

కరోనా మహమ్మారి సమయంలో బాధితులకు ఉదారంగా సహాయం అందించడం ద్వారా దేశ ప్రజల దృష్టి ఆకర్షించిన బాలీవుడ్ నటుడు సోనూసూద్ పై ఆదాయపన్ను శాఖ అధికారులు వరుసగా నాలుగు రోజులు పలు చోట్ల సోదాలు జరపడం సంచలనం కలిగించింది. 
 
తమ సోదాలలో సోనూసూద్ రూ 20 కోట్ల మేరకు పన్ను ఎగవేసిన్నట్లు, విదేశీ విరాళాల విషయంలో చట్టాలను ఉల్లంఘించారని ఆదాయపన్ను శాఖ అధికారులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అయితే తాను చ‌ట్టానికి క‌ట్టుబ‌డే పౌరుడిని అని, ఐటీ అధికారులు అడిగిన పత్రాలు, వివ‌రాల‌ను స‌మ‌ర్పించాన‌ని, వాళ్లు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చాన‌ని అంటూ ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం ఇప్పుడు ఆయన చేస్తున్నారు. 
 
పైగా, గతంలో త‌న‌కు రెండుసార్లు రాజ్య‌స‌భ సీటును ఆఫ‌ర్ చేశార‌ని, కానీ ఆ ఆఫ‌ర్ల‌ను వ‌దులుకున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. తద్వారా ఢిల్లీ ప్రభుత్వం ఆయనను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడంతో ఆయన ఎక్కడ తమ పార్టీలో చేరతారా అని `రాజకీయ కక్షసాధింపు’ చర్యలలో భాగంగా ఈ సోదాలు జరిగాయని ఆప్ నేతలు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చే ప్రయత్నం చేసిన్నట్లు కనిపిస్తున్నది. 
 
సెప్టెంబర్ నెల 15 న మొదలుపెట్టిన సోదాలు ఇప్పటికీ సోనూసూద్ కు  చెందిన మొత్తం 28 ప్రదేశాలలో , ముంబై,లక్నో, కాన్పూర్ , జైపూర్, ఢిల్లీ, గురుగ్రామ్ లలో జరిగాయి. ఈ సందర్భంగా అధికారులకు లభించిన ఆయన ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి పొంతనలేని సమాధానాలు ఇచ్చిన్నట్లు తెలుస్తున్నది. లెక్కకురాని  లావాదేవీలు భారీగా జరిగిన్నట్లు కూడా చెబుతున్నారు. 
 
రియల్ ఎస్టేట్ సంస్థలో భాగస్వామ్యం 
 
లక్నో లోని ఒక రియల్ ఎస్టేట్ సంస్థతో ఆయనకు భాగస్వామ్యం ఉంది. సదరు రియల్ ఎస్టేట్ సంస్థ పేరుకే రియల్ ఎస్టేట్ వ్యాపారమైనా వాస్తవానికి ఎక్కువగా మనీ లాండరింగ్ కు పాల్పడుతున్నట్లు కనుగొన్నారు. తాజా సోదాలలో సదరు రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రా వ్యాపారం లో ఉన్న సంస్థ ఆఫీసులో మొత్తం దొరికిన ఆధారాల ప్రకారం రూ 175 కోట్లకు లెక్కలు లేవు.
ఇక సోనూ సూద్ తన ప్రొఫెషన్ కి సంబంధించి వచ్చిన ఆదాయాన్ని బోగస్ అప్పులుగా పుస్తకాలలో చూపించినట్లు కనుగొన్నారు.  బోగస్ అప్పులు అంటె తన సినీ,ప్రకటనల వల్ల వచ్చిన ఆదాయాన్ని ఆన్ సెక్యూర్డ్ అప్పులుగా చూపించాడు.  వీటికి సంబంధించి పలు బోగస్ సంస్థలకి తన ఆదాయాన్ని నగదు రూపం లో ఇచ్చి ఆ బోగస్ సంస్థల దగ్గర నుండి అప్పు తీసుకుంటున్నట్లుగా చెక్ లు తీసుకొని వాటిని బాంక్ లలో జమ చేశాడు. 
 
ఇలా తీసుకున్న అప్పులని [బోగస్ ] రియల్ ఎస్టేట్ వ్యాపారం లో పెట్టుబడులుగా పెట్టాడు. కేవలం తన ఆదాయానికి పన్ను కట్టకుండా దానిని అప్పుగా చూపించి భూములు కొనుగోలు కోసం వాడాడు.  ఇక విదేశాలనుండి సూద్ ఫౌండేషన్ కి విరాళాల రూపంలో రూ 20 కోట్లు వచ్చాయి. విదేశీ విరాళాల విషయంలో చట్టాల (ఎఫ్ ఆర్ సి ఎ) నిబంధనలను ఉల్లంఘించారని కనుగొన్నారు.
క్రౌడ్ ఫండింగ్ పేరుతో వసూలు చేసిన రూ 20 కోట్లు నేరుగా సూద్ ఫౌండేషన్ లోని వచ్చాయి.  కానీ ఈ మొత్తంలో కేవలం రూ 1.5 కోట్లు మాత్రమే చారిటీ కోసం వినియోగించాడు. మిగతా డబ్బు సూద్ ఫౌండేషన్ లోనే ఉండిపోయింది. సూద్ ఫౌండేషన్ ను కరోనా లాక్ డౌన్ సమయంలో, అంటే జులై, 2020 లోనే స్థాపించాడు. పేదలకు కరోనా సమయంలో సహాయం కోసం వచ్చిన విరాళాలను ఖర్చు పెట్టకుండా ఎందుకు ఉంచిన్నట్లు?
కరోనా సమయంలో భారీగా విరాళాలు ఇచ్చిన్నట్లు ప్రచారం చేసుకున్న సోనూసూద్ కు లక్నో లోని ఇన్ఫ్రా ఫర్మ్ లో భాగస్వామ్య ఒప్పందం తో పెట్టుబడులు పెట్టేంత డబ్బు ఎక్కడినుండి వచ్చింది? అదే లక్నో ఇన్ఫ్రా సంస్థలో దొరికిన అకౌంట్ పుస్తకాల ప్రకారం లెక్కలు చూపని రూ 175 కోట్లను ఆదాయపన్ను రిటర్న్స్ లోనే చూపలేదు. 
మొత్తం 12 లాకర్లు ఉన్నట్లు గుర్తించి అధికారులు వాటిని సీజ్ చేశారు. వాటిని ఇంకా తెరువవలసి ఉంది. ఇలా ఉండగా, 2019లో కరోనా లాక్ డౌన్ సమయానికి 6 నెలల ముందే కోబ్రా పోస్ట్ అనే వెబ్ న్యూస్ పోర్టల్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో సోనూసూద్ చెప్పిన విషయాలు ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి. 
 
కోబ్రా పోస్ట్ స్టింగ్ ఆపరేషన్ 
 
ఈ ఆపరేషన్ చేయడానికి ముందు మూడు నెలల నుండి కోబ్రా పోస్ట్ నుండి ఇద్దరు వ్యక్తులు తాము ఒక రాజకీయ పార్టీకి సంబంధించి పబ్లిక్ రిలేషన్ అధికారులమని పరిచయం చేసుకొని ఆయనతో ఫోన్ లో మాట్లాడడం మొదలుపెట్టారు. అలా మూడు నెలల తరువాత సదరు స్టింగ్ ఆపరేషన్ చేసిన వ్యక్తులకి సోనూ సూద్ తనను నేరుగా కలవడానికి అప్పాయింట్ మెంట్ ఇచ్చాడు. 

ఆ స్టింగ్ ఆపరేషన్ లో సోనూసూద్ ని ఆ ఇద్దరు వ్యక్తులు పలు ప్రశ్నలు వేశారు అవేమిటో ఒక సారి చూద్దాం !

కోబ్రా పోస్ట్: మీరు మా పార్టీ కోసం ప్రచారం చేస్తారా ? అంటె ట్విట్టర్ లో ట్వీట్ చేసినందుకు ఎంత తీసుకుంటారు ? పేస్ బుక్ లో పోస్ట్ పెట్టినందుకు ఎంత తీసుకుంటారు ? ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టినందుకు ఎంత తీసుకుంటారు ? మేము బిజేపి పిఆర్ నుండి వచ్చాము.

సోనూసూద్ :మామూలుగా కార్పొరేట్ ప్రకటనల కోసం నేను ఒక ట్వీట్ కు రూ 5 లక్షలు తీసుకుంటాను.  అదే రాజకీయ పార్టీకి అయితే ఒక ట్వీట్ చేసినందుకు రూ 10 లక్షలు తీసుకుంటాను. అదే 
పేస్ బుక్   లో పోస్ట్ పెట్టినందుకు మరో రూ 10 లక్షలు, ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టినందుకు మరో రూ 10 లక్షలు తీసుకుంటాను. నాకు తెలిసిన కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన ప్రముఖులు ఉన్నారు.  వాళ్ళు కూడా ఇలానే రూ 10 లక్షలు తీసుకుంటారు ఒక్కో ట్వీట్ కోసం.

కోబ్రా పోస్ట్ : ఒక్కో ట్వీట్ కోసం కాకుండా నెలకి ఎంత తీసుకుంటారు? మేము నెలకి ఇంత అని ఇవ్వాలని అనుకుంటున్నాము.

సోనూసూద్ : నెలకి అయితే రూ 1.5 కోట్లు తీసుకుంటాను. అదీ బ్లాక్ లో మాత్రమే. ట్విట్టర్,
పేస్ బుక్  , ఇంస్టాగ్రామ్ లలో నెలకి ఒక్కో దాన్లో 5 పోస్టలు లేదా మెసేజెస్ పెడతాను.

కోబ్రా పోస్ట్ : కానీ విషయం రహస్యంగా ఉంచాల్సి ఉంటుంది మీరు.

సోనూ సూద్ : ఆ విషయం నాకు బాగా తెలుసు.  అలాగే నాకు తెలిసిన వాళ్ళు కూడా గత నాలుగేళ్లుగా రహస్యంగానే ఉంచుతున్నారు. ఇది మీరు నాకు ప్రత్యేకంగా చెప్పక్కరలేదు.

సోనూసూద్ కి కోబ్రా పోస్ట్ విలేఖరులకి మధ్య జరిగిన సంభాషణ ఇలా సాగింది. ఈ ఇంటర్వ్యూ తరువాత కోబ్రా పోస్ట్ విలేఖరులు వెళ్లిపోయారు మళ్ళీ కలిసి మాట్లాడదాం అంటూ. అయితే వాళ్ళు మళ్ళీ సోనూసూద్ కి ఫోన్ చేయలేదు కలవలేదు.  కానీ సోనూసూద్ మాత్రం వారం రోజుల పాటు వారికి ఎప్పుడు డీల్ కుదుర్చుకొందామని అంటూ ఫోన్ చేస్తూనే ఉన్నాడు. 

ఇలా ఉండగా, కరోనా బాధితులకు సహాయం చేయడానికి  సోనూసూద్ కు డబ్బు ఎక్కడి నుండి వచ్చింది ? లాక్ డౌన్ వలన షూటింగ్స్ లేవు. కానీ డబ్బులు ఖర్చు పెట్టాడు. ఆ తర్వాత పారితోషికాలను సగానికి సగం తగ్గించారు. రూ 1.5 కోట్ల ప్రచార డీల్ కోసం వారం పాటు అదే పనిగా ఫోన్ చేసిన సూద్ కు ఇంతలోనే అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? ఎవరిచ్చారు ? 
 
ప్రధానంగా సేవ పేరుతో బినామీల ద్వారా పలు ఫౌండేషన్ల నుండి [సింగపూర్ ] డబ్బు వచ్చింది. దానితో ఆయన వెనుక ఎవ్వరో ఉంది నడిపిస్తున్నట్లు పలు అనుమానాలు చెలరేగాయి. ఇప్పుడు ఆదాయపన్ను అధికారుల సోదాలపై వస్తున్న విమర్శలతో అటువంటి అనుమానాల  ముసుగు క్రమంగా తొలగుతున్నది.