డ్రగ్స్‌ కేసులో తారలను కాపాడేందుకు ప్రభుత్వం ఆత్రుత!

సంచలనం కలిగించిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో సినీతారల ప్రమేయంపై ఒక వంక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జరుపుతున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం హడావుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీతారలకు క్లీన్ చిట్ ఇచ్ఛిన్నట్లు ఎప్పుడో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఇప్పుడు లీక్ కావడం కలకలం రేపుతున్నది. 

ప్రధాన నిందితుడు కెల్విన్‌ ఆరోపించినట్లుగా టాలీవుడ్‌కు చెందిన కొందరు నటులకు వ్యతిరేకంగా బలమైన ఆధారాల్లేవని, అతడు తప్పుదోవపట్టించాడంటూ కోర్టుకు ఎప్పుడో ఎక్సైజ్‌ శాఖ నివేదించింది. 

ఈ కేసులో మంత్రి కేటీఆర్ కు సంబంధం ఉన్న కారణంగానే ప్రముఖ సినీ తారల పేర్లను కేసు నుండి తొలగించారని, దర్యాప్తు నివేదికలను సహితం ఈడీకి అందీయడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సమయంలో ఈ అంశం వెలికి రావడం ప్రాధాన్యత సంతరింప చేసుకోంది. 

సినీతారలు ఈ కేసు నుండి కాపాడాలని, ఈడీ దర్యాప్తులో సహితం వారిని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆతృతగా ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో లేని సినీ తారలను ఈడీ విచారణకు పిలిపించడంతో ప్రభుత్వంలోని పెద్దలు ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తున్నది.

 గత ఏడాది డిసెంబరు 28న దర్యాప్తు అధికారులు కెల్విన్‌పై రంగారెడ్డి జిల్లా కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌ తాజాగా బయటకు వచ్చింది. చార్జిషీట్‌ దాఖలై పది నెలలు అయ్యాక, ఇదే కేసులో  విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అది లీకవ్వడం చర్చనీయాంశమైంది. 

డ్రగ్స్‌ వ్యవహారంలో 2017లో 12 మంది సినీ ప్రముఖులను విచారించిన ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌).. చార్జిషీట్‌లో మాత్రం పూరి జగన్నాథ్‌ (పెట్ల జగన్నాథ్‌), తరుణ్‌ పేర్లను మాత్రమే పేర్కొంది. మిగతా వారి పేర్లను ఎక్కడ ప్రస్తావించలేదు. 

‘‘కెల్విన్‌ ఇచ్చిన సమాచారంతో సెలబ్రిటీలతోపాటు మరికొందరికి ఎన్డీపీస్‌ యాక్ట్‌-1985లోని సెక్షన్‌ 67 ప్రకారం నోటీసులిచ్చాం. వారి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నాం. డాక్యుమెంటరీ, ఇతర ఆధారాలను విశ్లేషించాం. ఎలాంటి బలమైన ఆధారాలు లభించలేదు.

పూరి జగన్నాథ్‌, తరుణ్‌లు స్వచ్చందంగా రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు ఇచ్చారని పేర్కొంది. వారిద్దరిలో ఎలాంటి డ్రగ్స్‌ ఆనవాళ్లు లేవని గత ఏడాది డిసెంబరు 8న ఫొరెన్సిక్‌ సైన్స్‌ లాబోరేటరి (ఎఫ్‌ఎ్‌సఎల్‌) నివేదిక ఇచ్చినట్లు వివరించింది.

అయితే ఈ కేసులో భారీగా మనీలాండరింగ్‌ జరిగినట్లు ఈడీ అనుమానిస్తుండగా.. కెల్విన్‌ విదేశాలకు రెండు సార్లు నగదు బదిలీ చేసినట్లు ఎక్సైజ్‌ శాఖ పేర్కొంది. కేసు విచారణలో భాగంగా దర్యాప్తు బృందం ప్రశ్నించిన నటుల పేర్లను ఛార్జ్‌షీట్‌లో చేర్చలేదు. 

డ్రగ్స్‌ కేసులో సెలబ్రిటీల పాత్రపై బలమైన, తగిన ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. సెలబ్రిటీలను నిందితులుగా చేర్చేందుకు కేవలం కెల్విన్‌ వాంగ్మూలం చాలదని స్పష్టం చేసింది. సెలబ్రిటీలు, ఇతర అనుమానితుల వద్ద డ్రగ్స్‌ లభించలేదని వివరించింది. 

 కెల్విన్‌కు బెంగళూరులో చదువుకునేటప్పటి నుంచి డ్రగ్స్‌ అలవాటుందని, 2013 నుంచి మిత్రులకు డ్రగ్స్‌ విక్రయించేవాడని అధికారులు ఛార్జ్‌షీట్‌లో తెలిపారు.