రూ 20 కోట్ల ప‌న్ను ఎగ‌వేసిన సోనూ సూద్‌

బాలీవుడ్ న‌టుడు సోనూ సూద్ ఇంట్లో వ‌రుస‌గా మూడు రోజుల పాటు ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు సోదాలు చేయగా సుమారు రూ 20 కోట్ల మేర ఆదాయ‌ప‌న్నును ఎగ‌వేసిన‌ట్లు వెల్లడైన్నట్లు ఆ శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. సోనూ సూద్‌కు చెందిన నాన్ ప్రాఫిట్ సంస్థ ఫారిన్ కాంట్రిబ్యూష‌న్ చ‌ట్టాన్ని ఉల్లంఘించి సుమారు రూ  2.1 కోట్లు స‌మీక‌రించిన‌ట్లు ఐటీశాఖ చెప్పింది.

న‌టుడికి సంబంధించిన ఇండ్లు, అత‌ని అసోసియేట్స్ ఇండ్లు, ఆఫీసుల్లో నిర్వ‌హించిన త‌నికీలు ప‌న్ను ఎగ‌వేత‌కు చెందిన అనేక ప‌త్రాలు దొరికిన‌ట్లు ఐటీశాఖ తెలిపింది. గత ఏడాది జులైలో ప్రారంభించిన సోనూ సూద్ చారిటీ ఫౌండేష‌న్ ఈ ఏడాది ఏప్రిల్ వ‌ర‌కు ఆ సంస్థ రూ 20 కోట్లు విరాళాల రూపంలో సేక‌రించిన‌ట్లు తెలుస్తోంది.

దీంట్లో ఇప్ప‌టి వ‌ర‌కు రూ 1.9 కోట్ల‌ను ఖ‌ర్చు చేశారు. మ‌రో రూ 17 కోట్లు ఆ సంస్థ బ్యాంక్ అకౌంట్లోనే ఉన్నాయి. బుధ‌వారం రాత్రి అత‌ని కార్యాల‌యాల్లో సోదాలు నిర్వ‌హించిన అధికారులు.. గురువారం ఉద‌యాన్నే ఇంటికి చేరుకున్నారు. ల‌క్నోకు చెందిన రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌తో సోనూ సూద్‌కు ఉన్న ప్రాప‌ర్టీ డీల్‌పై ప‌న్ను అధికారులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

బుధ‌వారం ఆరు చోట్ల సోదాలు నిర్వ‌హించారు. ల‌క్నో రియ‌ల్ ఎస్టేట్ కంప‌నీతో జ‌రిపిన డీల్‌పై అనుమానాలు ఉన్నాయి. ఈ డీల్‌లో ప‌న్ను ఎగ్గొట్టార‌న్న ఆరోప‌ణ‌ల‌పై స‌ర్వే జ‌ర‌పాల‌ని ఆదేశాలు ఇచ్చిన‌ట్లు ఆదాయపన్ను శాఖ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ ఆప‌రేష‌న్‌ను స‌ర్వేగా వాళ్లు పిలుస్తున్నారు.