జీఎస్టీ ప‌రిధిలోకి పెట్రోలియంకు ఇది సమయం కాదు

పెట్రోల్‌, డీజిల్‌ల‌ను జీఎస్టీ ప‌రిధిలోకి తేవ‌డానికి ఇది స‌రైన సమయం కాద‌ని జీఎస్‌టీ మండలి అభిప్రాయపడినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్రకటించారు. శుక్ర‌వారం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నోలో నిర్మ‌లా సీతారామ‌న్ అధ్య‌క్ష‌త‌న జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశం జ‌రిగింది.

ఈ భేటీలో జీఎస్టీ ప‌రిధిలోకి పెట్రోల్‌, డీజిల్ తీసుకొచ్చే విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింద‌ని త‌ర్వాత మీడియాకు నిర్మ‌లా సీతారామ‌న్ చెప్పారు. ప‌లు రాష్ట్రాలు జీఎస్టీ ప‌రిధిలోకి పెట్రోలియం ఉత్ప‌త్తుల‌ను తీసుకురావాల‌ని కోరుకోవ‌డం లేద‌ని, అందుకనే తగు నిర్ణయం తీసుకోలేక పోయామని ఆమె చెప్పారు. దీనిపై కేర‌ళ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ రాష్ట్రాల అభిప్రాయాన్ని కోర్టుకు నివేదిస్తామని తెలిపారు.

ప్రాణాధార ఔష‌ధాలు చాలా ఖ‌ర్చుతో కూడుకున్న‌వ‌ని, వాటిపై జీఎస్టీ త‌గ్గిస్తున్న‌ట్లు ఆర్ధిక మంత్రి తెలిపారు. కోవిడ్ ప‌రిధిలోకి రాని జోల్గ్‌న్గెల్స్మా, విల్టెప్సోల‌పై జీఎస్టీ మిన‌హాయించ‌డంతో రూ.16ల‌కు వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి వ‌స్తాయ‌ని ఆమె చెప్పారు. 

కాగా, వచ్చే ఏడాది జూన్‌ నుంచి రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం ఉండదు. వివిధ రాష్ట్ర పన్నుల్ని జీఎస్టీలో విలీనంచేసినందున రాష్ర్టాల ఆదాయంలో ఏర్పడే తగ్గుదల మొత్తాన్ని కేంద్రం 2022 జూన్‌ వరకూ ఆయా రాష్ట్రాలకు చెల్లించేలా గతంలో నిర్ణయించారు. ఈ చెల్లింపు ప్రక్రియ వచ్చే ఏడాదితో ముగుస్తుందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అయితే ఈ పరిహారం చెల్లింపు కోసం కొన్ని లగ్జరీ, హానికారక ఉత్పత్తులపై వసూలుచేసే సెస్‌ను మాత్రం 2026 మార్చివరకూ వసూలుచేస్తారు.

 సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు

” ఆన్‌లైన్ ఫుడ్ డెలివ‌రీ సంస్థ‌లు జొమాటో, స్విగ్గీ ఆర్డ‌ర్ల‌పై జీఎస్టీ విధించాల‌ని జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశం నిర్ణ‌యించింది.

* కండ‌రాల క్షీణ‌త‌ను నివారించ‌డానికి దిగుమ‌తి చేసుకునే ఔష‌ధాల‌పై ప‌న్ను మిన‌హాయింపు. ఆంఫోటెరిసిన్‌-బీ, టోలిసిలిజుమాబ్‌, రెమ్‌డెసివిర్‌, హెపారిన్ వంటి యాంటీ కాగులెంట్స్‌ల‌పై జీఎస్టీ మిన‌హాయింపు డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు కొన‌సాగింపు.

* క్యాన్స‌ర్ చికిత్స‌కు ఉప‌యోగించే కెయ్‌ట్రుడా, త‌దిత‌ర ఔష‌ధాల‌పై త‌గ్గింపు. ఆరోగ్య శాఖ సిఫార‌సు చేసిన ఏడు ఇత‌ర ఔష‌ధాల‌పై ఐజీఎస్టీ 12 నుంచి ఐదు శాతానికి త‌గ్గింపు.

* బ‌యోడీజిల్ బ్లెండింగ్ కోసం వినియోగించే డీజిల్‌పై జీఎస్టీ ఐదు శాతానికి త‌గ్గింపు. లోకోమోటివ్స్‌, ఇత‌ర విడి భాగాల‌పై జీఎస్టీ 12 నుంచి 18 శాతానికి పెంపు.

* రాష్ట్రాలు విధించే నేష‌న‌ల్ ప‌ర్మిట్ ఫీకి మిన‌హాయింపు. ఎయిర్‌పోర్ట్‌, ఇత‌ర దిగుమ‌తుల‌పై డ‌బుల్ టాక్స్ నుంచి మిన‌హాయింపు.

* కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల నిధుల‌తో నడిచే స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ ప‌థ‌కాల‌పై జీఎస్టీ రాయితీ.జ‌న‌వ‌రి నుంచి ఫుట్‌వేర్‌, టెక్స్‌టైల్ సెక్టార్ల‌పైఇన్వ‌ర్టెడ్ డ్యూటీ స‌ర్దుబాటుతో జీఎస్టీలో మార్పులు అమ‌లు.

  • ఫోర్టిఫైడ్‌ రైస్‌ కెర్నెల్‌పై పన్నును 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.
  • అన్ని రకాల పెన్నులపై ఒకటే పన్నురేటు 18 శాతంగా నిర్ణయం
  • పునరుత్పాదక ఇంధన పరికరాలపై 12 శాతం జీఎస్టీ విధింపు
  • హెన్నా పౌడరు, ఆకులపై 5 శాతం జీఎస్టీ విధింపు
  • రైల్వే విడిభాగాలు, లోకోమోటివ్‌లపై పన్ను 5 శాతం నుంచి 12 శాతానికి పెంపు
  • పాదరక్షలు, టెక్స్‌టైల్స్‌పై సుంకాల్ని మార్చాలన్న ప్రతిపాదనను కౌన్సిల్‌ అంగీకరించింది.

ఈ జీఎస్టీ స‌మావేశానికి ఏడు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు భౌతికంగా హాజ‌ర‌య్యారు. నిర్మ‌లా సీతారామ‌న్ అధ్యక్ష‌త‌న జ‌రిగిన జీఎస్టీ స‌మావేశానికి రాష్ట్రాల మంత్రులు భౌతికంగా హాజ‌రు కావ‌డం రెండేండ్ల త‌ర్వాత ఇదే తొలిసారి. ఇంత‌కుముందు 2019 డిసెంబ‌ర్ 18న జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు భౌతికంగా పాల్గొన్నారు.