మోదీ పుట్టిన రోజున 2 కోట్లకు పైగా టీకాలు

కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్‌ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఒకే రోజు రికార్డు స్థాయిలో 2 కోట్లకుపైగా టీకా డోసులు వేశారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని బీజేపీ నేతలు దేశవ్యాప్తంగా కరోనా టీకా ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టారు. 

ఈ నేపథ్యంలో మధ్యాహ్నానికి 1.3 కోట్లకుపైగా టీకా డోసులు వేయగా, సాయంత్రం ఐదు గంటలకు ఇది రెండు కోట్లకుపైగా నమోదైంది. శుక్రవారం రాత్రికి 2.5 కోట్ల డోసులను అందజేసే అవకాశం ఉంది. దీంతో ‘ఈ చారిత్రక రికార్డు.. ప్రధాని మోదీ పుట్టిన రోజు బహుమతి’ అంటూ బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు ట్వీట్‌ చేశారు.

మరోవైపు నేషనల్ హెల్త్ అథారిటీ చీఫ్ ఆర్ఎస్ శర్మ ఈ ఉదయం ఒక ట్వీట్ చేశారు. ‘కోవిడ్ -19కి వ్యతిరేకంగా భారతదేశ టీకాల నిర్విరామ ప్రయత్నాలను జరుపుకుంటూ, రియల్ టైమ్‌లో టీకాలు వేస్తున్నామని చూపించడానికి మేము ఒక టిక్కర్‌ను జోడించాము. ప్రస్తుతం నిమిషానికి 42,000 టీకాలు లేదా సెకనుకు 700కు పైగా టీకాలు ఇది చూపిస్తున్నది’ అని పేర్కొన్నారు.

కాగా, ఆగస్ట్‌ 31న దేశంలో గరిష్ఠంగా ఒకే రోజు 1.3 కోట్ల డోసుల టీకాలు వేశారు. తాజాగా శుక్రవారం రెండు కోట్లకుపైగా టీకా డోసులతో కొత్త రికార్డు నెలకొన్నది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రారంభించిన ఈ ఏడాది జనవరి నుంచి శుక్రవారం ఉదయానికి 77 కోట్ల డోసుల టీకాలు వేయగా సాయంత్రానికి ఇది 79 కోట్ల డోసులను దాటింది. 

2035 గ‌వ్వ‌ల‌తో మోదీ సైక‌త శిల్పం 

ప్ర‌ధాని పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్ర‌ముఖ సాండ్ ఆర్టిస్ట్ సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్..  పూరీ బీచ్ వ‌ద్ద‌  ప్రధాని న‌రేంద్ర మోదీ సైక‌త శిల్పాన్ని నిర్మించారు. మోదీ సైక‌త శిల్పం కోసం 2035 స‌ముద్ర గ‌వ్వ‌ల‌ను ప‌ట్నాయ‌క్ ఉప‌యోగించారు. ఆ సైక‌త శిల్పం మీద హ్యాపీ బ‌ర్త్‌డే మోదీజీ అని గ‌వ్వ‌ల‌తో లిఖించారు.  హ్యాపీ బ‌ర్త్ డే మోదీజి. మ‌హాప్ర‌భు జ‌గన్నాథుడు మోదీని ఆశీర్వ‌దించి, ఆయ‌న‌కు ఆయురారోగ్యాల‌కు క‌లిగించాల‌ని, ఇంకా మ‌న దేశానికి సేవ చేసే భాగ్యాన్ని మోదీకి క‌లిగించాల‌ని కోరుకుంటున్నాను. అందుకే.. 2035 గ‌వ్వ‌ల‌తో.. మోదీ సైక‌త శిల్పాన్ని పూరీ బీచ్ వ‌ద్ద నిర్మించాను.. అని సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్ ట్వీట్ చేశారు.

దీంతో సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్ సైక‌త శిల్పం ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు కూడా ఆ ఫోటోను చూసి మైమ‌రిచిపోతున్నారు. మోదీకి శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్.. త‌రుచూ పూరీ బీచ్ వ‌ద్ద సైక‌త శిల్పాల‌ను నిర్మిస్తుంటారు.

ఇటీవ‌ల గ‌ణేశ్ చ‌తుర్థి సంద‌ర్భంగా స‌ముద్ర గ‌వ్వల‌తో వినాయ‌కుడి సైక‌త శిల్పాన్ని సుద‌ర్శ‌న్ నిర్మించిన విష‌యం తెలిసిందే. ఇక‌  ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పుట్టిన రోజు వేడుక‌లు.. దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ప్ర‌ధాని మోదీ 71వ పుట్టిన రోజు సంద‌ర్భంగా వార‌ణాసిలోని భార‌త్‌మాతా టెంపుల్‌లో 71000 దీపాల‌ను వెలిగించ‌నున్నారు.

బీజేపీ కార్య‌క‌ర్త‌లు కూడా ప్ర‌ధాని మోదీ పుట్టిన రోజు వేడుక‌ల‌ను `సేవ సమర్పణ్ అభియాన్’గా దేశ వ్యాప్తంగా 20 రోజులపాటు జరుపుతున్నారు. ఆయన తోలుత గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి 20 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేబడుతున్నారు.