1993 ముంబై పేలుళ్ల తరహా దాడులకు కుట్ర!

దేశానికి పెద్ద ఉగ్రదాడి తప్పింది. పాక్‌ ప్రేరేపిత ఉగ్రముఠాను ఇటీవల అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు వారి నుంచి కీలక విషయాలను రాబట్టారు. రాబోయే పండగల సీజన్‌లో భారీ ఉగ్ర దాడులకు పాల్పడేందుకు కుట్రపన్నిన ఆరుగురు ముష్కరులు  1993 నాటి ముంబై వరుస పేలుళ్ల తరహా దాడులకు ప్లాన్‌ వేసినట్టు దర్యాప్తులో తేలింది.
 
వంతెనలు, రైల్వే ట్రాక్‌లు, భారీ సమూహాలను లక్ష్యంగా భీకర పేలుళ్లకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు ఉగ్రవాదుల నుండి ఇప్పటికే 1.5 కేజీల ఆర్‌డిఎక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం కలిగించేందుకు ఈ స్థాయి ఆర్‌డిఎక్స్‌ సరిపోతుందని దర్యాప్తు అధికారులు తెలిపారు. దీని కోసం ఉగ్రవాదులంతా కలిసి పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు తేలింది.
కాగా 1993 మార్చి 12న ముంబైలో 12 వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం నేతృత్వంలో జరిగిన ఈ పేలుళ్లలో 257 మంది ప్రాణాలు కోల్పోగా.. 1,400 మంది గాయపడ్డారు. ఈ దాడికి ప్రధాన సూత్రదారైన యాకుబ్‌ మేమన్‌ను 2015లో ఉరితీశారు.
 
దర్యాప్తులో మరికొంత మంది పాత్ర కూడా ఉన్నట్లు తేలిందని, త్వరలో వారిని కూడా అరెస్టు చేస్తామని చెప్పారు. గురుద్వారా పోర్టు నుండి పాకిస్తాన్‌లోకి సముద్ర మార్గం ద్వారా ప్రవేశించామని, ఒమన్‌ నుండి పాక్‌కు వెళ్లేటప్పుడు మోటర్‌ బోట్‌ వినియోగించినట్లు నిందితులు జీషన్‌, ఒసామా దర్యాప్తులో తెలిపారు. 
 
ఈ ఇద్దరు ఉగ్రవాదులతో పాటు సుమారు 15 మంది బెంగాలీ మాట్లాడే వ్యక్తులను పాక్‌ ఉగ్రవాద సంస్థ గురుద్వారా పోర్టుకు సమీపంలో జియోనీ నగరంలో ఓ ఫామ్‌ హౌస్‌లో ట్రైనింగ్‌ ఇచ్చినట్లు సమాచారం. ఇద్దరు ఉగ్రవాదులతో పాటు వారికి సహకరించిన మరో ఆరగురుని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.