ఢిల్లీ, పంజాబ్ లలో ఉగ్రదాడులపై హై ఎలెర్ట్!

పాకిస్థాన్ ఐఎస్ఐ మద్దతు ఉన్నఆరుగురు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత పండుగల సమయంలో దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు కుట్రలు పన్నుతున్నట్లు వెల్లడి కావడంతో ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. దసరా, దీపావళి పండుగల సందర్భంగా తీవ్రవాదులు హింసాత్మక సంఘటనలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయంటూ కేంద్ర ఇంటెలిజెన్స్‌ శాఖ హెచ్చరించడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేబడుతున్నారు. 
 పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆ రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. అమృత్ సర్ జిల్లాలో గత నెలలో జరిగిన పేలుడులో పాల్గొన్న పాక్ ఐఎస్ఐ మద్దతు ఉన్న నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేసిన తర్వాత రాష్ట్రంలో పోలీసుబలగాలను సీఎం అప్రమత్తం చేశారు. గత 40 రోజుల్లో పాక్ టెర్రర్ మాడ్యూల్ ను ఛేదించిన నాల్గవ కేసు.పంజాబ్ రాష్ట్రంలో ఉగ్రవాదులు శాంతిభద్రతలకు భంగం కలిగించేలా చేస్తున్న ప్రయత్నాలను గమనించిన సీఎం అమరీందర్ సింగ్ హైఅలర్ట్ ప్రకటించారు.
రాష్ట్రంలోని మార్కెట్లలో భద్రతను పెంచాలని సీఎం డీజీపీని ఆదేశించారు.పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఖాసిమ్‌తో సహా ఇద్దరు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులను కూడా గుర్తించారు.సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి ఉగ్రవాదుల కదలికలను గుర్తించి వారిని అణచివేయాలని సీఎం అమరీందర్ ఆదేశించారు.
ఢిల్లీలో కూడా  పోలీసు ఉన్నతాధికారులు హై అలర్ట్‌ను ప్రకటించారు. పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. అక్టోబర్‌ 14న దసరా, నవంబర్‌ నాలుగున దీపావళి పండుగల సందర్భంగా అన్ని జిల్లాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నారు. జనాలు అధికంగా గుమికూడే మార్కెట్ల వద్ద పోలీసుల నిఘాను పెంచనున్నారు. 
 
ప్రముఖ జౌళి, నగల దుకాణాలు, వాణిజ్య సంస్థలు, షాపింగ్‌ మాల్స్‌ తదితర ప్రాంతాల్లో సాయుధ దళాలతో కాపలా ఏర్పాటు చేయనున్నారు. ఇదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బస్‌స్టేషన్లు, ప్రధాన రైల్వేస్టేషన్ల వద్ద కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 
 
రాష్ట్రంలో తీవ్రవాదులు చొరబడకుండా సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి పోలీసుల నిఘాను కూడా పెంచుతున్నామని ఆయన వివరించారు.