వ్యక్తిగత అజెండా కోసమే సెంట్ర‌ల్ విస్టాపై విమర్శలు

కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణం కోసం చేప‌డుతున్న సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టును విమ‌ర్శిస్తున్న వారిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ  ప్ర‌తిప‌క్షాలు కేవ‌లం వ్యక్తిగత  ఎజెండా కోస‌మే జాగ్ర‌త్త‌ప‌డుతున్నాయ‌ని ఆరోపించారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో కొత్త‌గా నిర్మించిన ర‌క్ష‌ణ‌శాఖ ఆఫీసుల‌ను ఇవాళ ప్ర‌ధాని ప్రారంభిస్తూ కీల‌క ప్ర‌భుత్వ ఆఫీసులు, మంత్రిత్వ కార్యాల‌యాలు ఎలా ఉన్నాయో ప్ర‌తిప‌క్షాలు ప‌ట్టించుకోవ‌డంలేద‌ని ధ్వజమెత్తారు. 
 
సుమారు రూ 20 వేల కోట్ల‌తో సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టును చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. సెంట్ర‌ల్ విస్టా కింద కొత్త పార్ల‌మెంట్ భ‌వనంతో పాటు కేంద్ర ప్ర‌భుత్వ ఆఫీసుల‌ను నిర్మించ‌నున్నారు. సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టును అడ్డుకునేందుకు కొంద‌రు ఎలా ప్ర‌వ‌ర్తించారో తెలుసు అని, స్వ‌లాభం కోసం త‌ప్పుడు స‌మాచారాన్ని చేర‌వేశార‌ని ప్రధాని పేర్కొన్నారు.
కానీ వాళ్లు ఎప్పుడూ ప్ర‌భుత్వ కార్యాల‌యాల దీన‌స్థితి గురించి మాట్లాడ‌లేద‌ని, మంత్రులు ప‌నిచేసే ఆఫీసులు ఎలా ఉన్నాయో ప‌ట్టించుకోలేద‌ని, ర‌క్ష‌ణ‌శాఖ కాంప్లెక్స్ గురించి వాళ్లు ఎన్న‌డూ పెద‌వి విప్ప‌లేద‌ని ప్ర‌ధాని మోదీ విమ‌ర్శించారు. ర‌క్ష‌ణ‌శాఖ ఆఫీసు గురించి ప్ర‌తిప‌క్షాలు మాట్లాడి ఉంటే, వాళ్లు చెప్పే అబద్దాలు బ‌య‌ట‌ప‌డేవ‌ని మోదీ ఎద్దేవా చేశారు. 

ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌‌‌లపై దృష్టి పెట్టినపుడు, ఆధునిక మౌలిక సదుపాయాలు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయని ప్రధాని పేర్కొన్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో జరుగుతున్నది ఇదేనని స్పష్టం చేశారు. ఈ డిఫెన్స్ ఆఫీసెస్ కాంప్లెక్స్‌లో అన్ని రకాల ఆధునిక సదుపాయాలు  ఉన్నాయని, ఆధునిక సదుపాయాలు కలిగిన పని పరిస్థితుల్లో మరింత మెరుగ్గా పని చేయడానికి త్రివిధ దళాలకు అవకాశం కలుగుతుందని చెప్పారు. 

ఈ డిఫెన్స్ ఆఫీసెస్ కాంప్లెక్స్‌ల నిర్మాణం 12 నెలల్లో పూర్తయిందని ప్రధాని చెప్పారు. కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఈ కార్యకలాపాలు జరిగాయని, దీనివల్ల మహమ్మారి సమయంలో వందలాది మంది కూలీలకు ఉపాధి దొరికిందని చెప్పారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంటు భవనం నిర్మాణం కూడా నిర్ణీత సమయంలోనే పూర్తవుతుందని ప్రధాని తెలిపారు.  

ఈ నూతన కార్యాలయాల్లో దాదాపు 7,000 మంది అధికారులు పని చేస్తారు. రక్షణ మంత్రిత్వ శాఖ, త్రివిధ దళాల కార్యాలయాలను ఈ సముదాయంలో ఏర్పాటు చేశారు. త్రివిధ దళాలతోపాటు, సాధారణ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గతంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణంపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణం క్రిమినల్ వేస్టేజ్ అని దుయ్యబట్టారు. ప్రజల జీవితాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, కొత్త సభను ఏర్పాటు చేయాలనే గుడ్డి దురహంకారానికి ప్రాధాన్యం ఇవ్వకూడదని హితవు పలికారు. 
 
 వ‌చ్చే ఏడాది రిప‌బ్లిక్ డే ప‌రేడ్ సెంట్ర‌ల్ విస్టాలోనే!
 
 కొత్త‌గా అభివృద్ధి చేసిన సెంట్ర‌ల్ విస్టా లోనే వ‌చ్చే ఏడాది రిప‌బ్లిక్ డే ప‌రేడ్ జ‌రుగుతుంద‌ని కేంద్ర మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పూరి తెలిపారు.  రెండున్న‌ర నెల‌ల్లో ఈ ప్రాజెక్ట్ పూర్త‌వుతుంద‌ని చెప్పారు. అంతేకాదు వ‌చ్చే ఏడాది పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు కొత్త పార్ల‌మెంట్ బిల్డింగ్‌లోనే జ‌రుగుతాయ‌ని కూడా ఆయ‌న వెల్ల‌డించారు. 
 
అటు కేంద్ర హౌజింగ్ అండ్ అర్బ‌న్ అఫైర్స్ మినిస్ట్రీ కూడా ఈ ప్రాజెక్ట్ స‌మ‌యానికే పూర్త‌వుతుంద‌ని, 2022 రిప‌బ్లిక్ డే ప‌రేడ్ వేడుక‌ల‌కు ఆతిథ్య‌మిస్తుంద‌ని చెబుతోంది. సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగంగా కొత్త పార్ల‌మెంట్ బిల్డింగ్‌, సెక్ర‌టేరియ‌ట్‌, 3 కి.మీ. రాజ్‌ప‌థ్ మార్గం పున‌రుద్ధ‌ర‌ణ‌, కొత్త ప్ర‌ధాన‌మంత్రి నివాసం, పీఎంవో, కొత్త ఉపాధ్య‌క్షుడి ఎన్‌క్లేవ్ నిర్మిస్తున్నారు.