సమతా విగ్రహావిష్కరణకు రాష్ట్రపతికి ఆహ్వానం

హైదరాబాద్‌ శివారులోని ముచ్చింతల్‌లో నెలకొల్పిన  216 అడుగుల ఎత్తైన సమతా ప్రతిమ (స్టాచూ ఆఫ్‌ ఈక్వాలిటీ) విగ్రహాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. 

విగ్రహ ప్రతిష్ఠకు ప్రత్యేక ఆహ్వానితులుగా రావాల్సిందిగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను శ్రీ తిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి ఆహ్వానించారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి ఆహ్వానపత్రం అందజేశారు. 

అదేవిధంగా ఉపరాష్ట్రపతి నివాసంలో ఎం వెంకయ్యనాయుడును కూడా కలిసిన చినజీయర్ స్వామి.. వెంకయ్య దంపతులను కూడా విగ్రహ ప్రతిష్ఠకు ఆహ్వానించారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలను కూడా కలిసి ఆహ్వానపత్రాలు అందజేయనున్నారు.

 200 ఎకరాల స్థలంలో దాదాపు రూ.1000 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. ఈ ప్రతిమ ఆవిష్కరణ  సందర్భంగా 1035 హోమ గుండాలతో ప్రత్యేక యాగ క్రతువు నిర్వహించనున్నట్లు తెలిసింది.

సమాజంలో అంటరానితనాన్ని, వివక్షను రూపు మాపి సమానత్వ సాధన కోసం కృషి చేసిన భగవద్రామానుజుల వారు ఆధ్యాత్మికవేత్తగానే గాక,  సామాజిక సంస్కరణాభిలాషిగా సమాజంపై చెరగని ముద్ర వేశారని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.  
.
సమాజంలో నెలకొన్న వివక్షకు వ్యతిరేకంగా వేయి సంవత్సరాల క్రితమే ఆచరణాత్మక విప్లవాన్ని సృష్టించిన భగవద్రామానుజులు ఆదర్శనీయుని అయన పేర్కొన్నారు. 
భగవంతుడు అందరివాడు అంటూ వారు చూపిన మార్గం ఆచరణీయమని తెలిపారు.
సామాజిక చైతన్య ప్రబోధకులైన రామానుజుల వారి అతిపెద్ద ప్రతిమను ఏర్పాటు చేయడం ద్వారా, వారి బోధనలు, సందేశం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు అవకాశం ఉంటుందని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు.