జగన్ బెయిల్ రద్దు పిటీషన్ కొట్టివేత

సీబీఐ కోర్టులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనతో పాటు, సహా నిందితుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిల బెయిల్  రద్దు పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
 
రఘురామ దాఖలుచేసిన ఈ పిటిషన్‌పై జూలై ఆఖరులో వాదనలు ముగిశాయి. తీర్పును అప్పటినుంచి కోర్టు రిజర్వు చేసింది. ముఖ్యమంత్రిగా తనకుండే అధికారాలను ఉపయోగించి.. జగన్‌ బెయిల్‌ షరతులు ఉల్లంఘిస్తున్నారని రఘురామ ఏప్రిల్‌ మొదటి వారంలో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపించారు. 
 
బెయిల్‌ రద్దుచేసి ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని కోరారు.  సీఎం హోదాలో జగన్‌ వివిధ కారణాలు చెబుతూ, కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ కూడా రద్దు చేయాలని రఘురామ పిటిషన్‌ దాఖలు చేశారు.

తన పిటిషన్‌ను సీబీఐ కోర్టు డిస్మిస్ చేయడంతో సాక్షి దినపత్రిక వార్త నిజమని తేలిందని రఘురామకృష్ణరాజు న్నారు. సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుపై ఉన్నత న్యాయస్థానాన్ని సంప్రదిస్తానని ఆయన ప్రకటించారు. న్యాయస్థానాలను అపార్థం చేసుకునే అవకాశం ఉంటుందని, అది మంచిది కాదనే ఉద్దేశంతో తన పిటిషన్‌ను వేరే బెంచ్‌కు ఇవ్వాలని హైకోర్టును అభ్యర్థించానని తెలిపారు. 

జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్‌ రద్దు పిటిషన్‌ను వేరే బెంచ్‌కు మార్చాలని కోరుతూ ఆయన మంగళవారం వేసిన పిటీషన్ ను తొలుత తెలంగాణ హైకోర్టును కొట్టివేసింది. అయితే ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన హైకోర్టు.. జగన్‌, విజయసాయి బెయిల్‌ రద్దు పిటిషన్ల బదిలీకి నిరాకరించింది. రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.