ఫేస్‌బుక్, ట్విట్టర్‌లకు రష్యా భారీ జరిమానా

నిషిద్ధ వార్తలను తొలగించనందుకు ఫేస్‌బుక్,టిట్టర్‌లపై రష్యా  జరిమానా విధించింది. రష్యా ప్రభుత్వం ఇదివరకే ఆ విదేశీ దిగ్గజ సోషల్ మీడియా కంపెనీలపై జరిమానాలు విధించింది. ఈ నెలలో రష్యా పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్నాయి. అమెరికాకు చెందిన టెక్ కంపెనీలు ఇందులో జోక్యం చేసుకుంటున్న ఆరోపణతో రష్యా నియంత్రణ నిబంధనలను మరింత కఠినం చేసింది. 

మాస్కోలోని కోర్టు ఫేస్‌బుక్‌పైన ఐదు జరిమానాలు విధించింది. వాటి మొత్తం రూ. 2.12 కోట్లు. ఇదేవిధంగా ట్విట్టర్‌పైన రూ. 50 లక్షల జరిమాన విధించింది. ఇప్పటి వరకు రష్యాలో ఫేస్‌బుక్‌పైన రూ. 9కోట్లు, ట్విట్టర్‌పైన రూ. 4.5 కోట్ల జరిమాన విధించినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ టాస్ తెలిపింది.

న్యాయాధికారులు రష్యా వినియోగదారుల డేటాను దేశీయ సర్వీసెస్‌లో ఉంచనందుకు, ఇతర నేరాలకుగాను గూగుల్‌పైన కూడా జరిమాన విధించారు. రష్యా ఎన్నికల్లో అమెరికా టెక్ దిగ్గజ కంపెనీలు జోక్యం చేసుకుంటున్నందుకు గత వారం రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ మాస్కోలో అమెరికా రాయబారిని పిలిచి మందలించింది. 

అధికారంలోని యునైటెడ్ రష్యా పార్టీకి చెందిన రాజకీయవేత్తలను ఓటింగ్‌తో ఎలా ఓడించాలంటూ ప్రచారం చేస్తున్న డజన్లకొద్దీ వెబ్‌సైట్లను రష్యా మీడియా రెగ్యులేటర్ ‘రోస్‌కోమ్‌నద్జర్’ బ్లాక్ చేసింది. నావల్‌నీకి చెందిన ‘స్మార్ట్ ఓటింగ్’ ప్రచారంకు చెందిన యాప్‌లను తమ స్టోర్ల నుంచి తొలగించాల్సిందిగా ఆ మీడియా రెగ్యులేటర్ గూగుల్, ఆపిల్ టెక్ కంపెనీలను కోరింది.

గూగుల్‌కు 17.7 కోట్ల డాలర్ల జరిమానా

కాగా, దక్షిణ కొరియా వాణిజ్య నియంత్రణ సంస్థ ఫెయిర్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టిసి) గూగుల్‌పై భారీ జరిమానా విధించనున్నది. తమ (యాప్‌లను) సాఫ్ట్‌వేర్‌ను వినియోగించాలంటూ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులపై ఒత్తిడి చేసిందన్న కారణంగా గూగుల్‌పై 17.7 కోట్ల డాలర్ల జరిమానా విధించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
 
శాంసంగ్‌లాంటి కంపెనీల స్మార్ట్‌ఫోన్లలో ఇతర సాఫ్ట్‌వేర్‌లను గూగుల్ బ్లాక్ చేయడాన్ని ఎఫ్‌టిసి తప్పు పట్టింది. కొరియా తమ దేశ టెలికం చట్టాల్లో మార్పు చేసింది. గూగుల్, ఆపిల్ కంపెనీల ఆధిపత్యాన్ని తగ్గించేదిశగా చర్యలు తీసుకుంటోంది. తమ దేశీయ సాఫ్ట్‌వేర్ కంపెనీలకు వాణిజ్యపరంగా నష్టం జరగకుండా కొరియా చర్యలు చేపట్టినట్టుగా భావిస్తున్నారు. అయితే, కొరియా విధించే జరిమానాను చట్టపరంగా సవాల్ చేయనున్నట్టు గూగుల్ యాజమాన్యం తెలిపింది.