5.3 శాతానికి తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం

ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడం వల్ల చిల్లర ద్రవ్యోల్బణం ఆగస్టు నెలలో  5.3 శాతానికి తగ్గిందని అధికారిక డేటా పేర్కొంది. వినియోగ ధరల సూచీ (సిపిఐ) ఆధారంగా చిల్లర ద్రవ్యోల్బణం జులైలో 5.59 శాతంగా, 2020 ఆగస్టులో 6.69 శాతంగా ఉంది. 

జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ ఒ) విడుదల చేసిన డేటా ప్రకారం ఫుడ్ బాస్కెట్ లో ద్రవ్యోల్బణం ఆగస్టులో 3.11 శాతంగా ఉంది. ఇది అంతకు మునుపు జులై నెలలో 3.96 శాతంగా ఉంది. కాగా భారత రిజర్వు బ్యాంకు కీలక వడ్డీ రేట్లను మార్పు చేయకుండా యథాతథంగా ఉంచింది.

వినియోగ ధర సూచీ ద్రవ్యోల్బణం 2021-22లో 5.7 శాంతంగాను, రెండవ త్రైమాసికంలో 5.9 శాతంగా, మూడో త్రైమాసికంలో 5.3 శాతం, నాలుగో త్రైమాసికంలో 5.8 శాతంగా ఉండగలదని ఆర్ బిఐ ప్రొజెక్ట్ చేసింది. కాగా 2022-23 ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో వినియోగ ధరల సూచీ ద్రవ్యోల్బణం 5.1 శాతం ఉండగలదని కూడా ఆర్ బిఐ ప్రొజెక్ట్ చేసింది.

కాగా, కొవిడ్‌ సద్దుమణగడంతో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటుపై మరిత ఆశాభావం వ్యక్తం అవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం భారత ఆర్థిక వ్యవస్థ 10 శాతం వరకు వృద్ధి రేటు నమోదు చేసే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక పరిశోధనా సంస్థ ఎన్‌సీఏఈఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ పూనమ్‌ గుప్తా ఆశాభావం వ్యక్తం చేశారు. కొవిడ్‌ ప్రఽభావం తగ్గుముఖం పట్టడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తున్న పురోభివృద్ధి ఇందుకు ప్రధానంగా దోహదం చేస్తాయని తెలిపారు.