పారిశ్రామిక వర్గాలకు నగదు లభ్యత సమస్య ఉండబోదు

భారత పారిశ్రామిక వర్గాలకు ఇంకెంతో కాలం నగదు లభ్యత సమస్య ఉండబోదని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ భరోసా ఇచ్చారు. అక్టోబర్‌ 15 నుంచి రుణ విస్తరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆమె వెల్లడించారు. దీంతో ఆర్థిక వ్యవస్థ రికవరీ వేగవంతం కానుందని ఆమె పేర్కొన్నారు. 
 
పండగ సీజన్‌లో రుణ లభ్యత పెరగడంతో పాటు ఎగుమతులకు మద్దతు లభించనుందని ఆర్ధిక మంత్రి చెప్పారు. 2019 తరహాలోనే ఈ దఫా కూడా రుణ క్యాంపెయిన్‌ కొనసాగనుందని తెలిపారు. బ్యాంక్‌లు 400 జిల్లాల్లో రుణ మేళాలను నిర్వహించి రూ.4.9 లక్షల కోట్ల రుణాలు జారీ చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
 
చెన్నరులో ఎంపిక చేసిన సిఐఐ సభ్యులతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బ్యాంకింగేతర విత్త సంస్థలు (ఎన్‌బిఎఫ్‌సి)లు, మైక్రోఫైనాన్స్‌ సంస్థలు కూడా రుణ క్యాంపెయిన్‌లో భాగస్వామ్యం కానున్నాయని తెలిపారు. బ్యాంక్‌ల్లో సగటు కంటే రూ.6 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయని ఆమె చెప్పారు.

ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ కంపెనీలు, బ్యాంక్‌లు, విత్త సంస్థల్లో రూ.1.75 లక్షల కోట్ల విలువ చేసే డిజిన్వెస్ట్‌మెంట్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆమె పేర్కొన్నారు.

 
 వైద్య మౌలిక వసతుల కల్పన పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆమె చెప్పారు. ద్వితీయ, తృతీయ స్థాయి నగరాల్లోని ప్రయివేటు ఆసుపత్రులకు మద్దతును ఇవ్వనుందని ఆమె తెలిపారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుందని అంటూ ఇప్పటికే  74.38 కోట్ల మందికి సింగిల్‌ డోసు పూర్తి అయ్యిందని తెలిపారు. 
 
దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీలో ఉందని.. గడిచిన జూన్‌ త్రైమాసికంలో జిడిపి 20.1 శాతం పెరిగిందని సిఐఐ ప్రెసిడెంట్‌ టివి నరేంద్రన్‌ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతం పెరుగొచ్చని అంచనా వేశారు. ప్రయివేటు పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం మూలధన మద్దతును అందించాలని నరేంద్రన్‌ కోరారు. డిమాండ్‌ రికవరీకి పెట్టుబడులు మద్దతును ఇవ్వనున్నాయని పేర్కొన్నారు.