ఆందోళన చేస్తున్న రైతులపై పంజాబ్ సీఎం ఆగ్రహం 

మూడు కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ సంవత్సరానికి పైగా పోరాడుతున్న రైతులకు సంఘీభావం తెలుపుతూ వస్తున్న పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ఒకేసారి వెనుకడుగు వేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నిరసన కార్యక్రమాలతో తమ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని పేర్కొంటూ కేంద్రంపై పోరాడేందుకు ఢిల్లీలో ఉద్యమించాలి గాని ఇక్కడ ఏమిటని ప్రశ్నించారు. ‘ఢిల్లీలో ఇష్టమొచ్చినట్టు చేసుకోండి.. కానీ పంజాబ్‌లో ఎందుకు?’ అని నిలదీశారు. 
కేంద్ర ప్రభుత్వంపై పోరాడేందుకు రైతులు తమ శక్తియుక్తుల్ని ఉపయోగించాలని, కానీ రాష్ట్రంలో కాదని హితవు చెప్పారు. పంజాబ్‌కు ఎందుకు నష్టం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. హరియాణా, ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేసుకోండి అని సూచించారు. రైతులు రాష్ట్రంలోని 113 ప్రాంతాల్లో జరుపుతున్న ఆందోళనలు రసఃత్రానికి ఎటువంటి ప్రయోజనం చేకూర్చడం లేదని, పైగా రాష్ట్రాభివృద్ధిపై తీవ్రంగా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దానితో ఆదాయం కోల్పోవలసి వస్తున్నదని చెప్పారు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ చట్టాలను తిరస్కరిస్తూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసినదాని, దానిని గవర్నర్ కు పంపామని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే గవర్నర్ ఆమోదం కోసం ఇంకా రాష్ట్రపతికి పంపలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో ఉన్నమేరకు రైతులకు సహాయం చేస్తూనే ఉన్నదని స్పష్టం చేశారు.
ఈ మధ్య రైతు ప్రతినిధులు కలసి చెరకు ధరను క్వింటాల్ కు రూ 325 నుండి రూ 350కు పెంచమని కోరితే, వెంటనే ఆమోదం తెలిపామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
పంజాబ్‌లో వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వాఖ్యలు ప్రాధాన్యత సంతరింప చేసుకున్నాయి. కొత్త వ్యవసాయ చట్టాలతో తమకు మద్దతు ధర దక్కదని, వ్యవసాయం కార్పొరేటు పరం అవుతుందనే ఆందోళనతో రైతులు ఉద్యమ బాట పట్టారు.
అయితే ఒక వంక రైతులు ఉద్యమం  చేస్తుండగానే, పంజాబ్ లో రికార్డు స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులను మద్దతు ధరకు కొనుగోలు జరుగుతూ ఉండడం, రైతులు సహితం తమ ఉత్పత్తులను అమ్ముతూ గతంలో కన్నా ఎక్కువ ధర పొందడం జరుగుతున్నది. పైగా, గత సంవత్సరకాలంగా రికార్డు స్థాయిలో ప్రభుత్వ ఏజెన్సీలు కొనుగోలు జరిపాయి.