24న క్వాడ్ సద‌స్సులో ప్ర‌ధాని మోదీ

అమెరికా ప్ర‌భుత్వం నిర్వ‌హించ‌నున్న క్వాడ్ సద‌స్సులో ప్ర‌ధాని మోదీ ప్ర‌త్య‌క్షంగా పాల్గొన‌నున్నారు. సెప్టెంబ‌ర్ 24వ తేదీన జ‌రిగే ఆ భేటీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆతిథ్య ఇస్తున్నారు. ప్ర‌ధాని మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్ర‌ధాని స్కాట్ మారిస‌న్‌, జ‌పాన్ ప్ర‌ధాని యోషిహిడే సుగాలు కూడా హాజ‌రుకానున్నారు. 

బైడెన్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ మొదటిసారిగా ప్రత్యక్షంగా కలవనున్నారు. ముఖ్యంగా ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరింప చేసుకొంది. ఆఫ్ఘన్ గడ్డపై ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం గురించి ఈ  నాలుగు దేశాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. 

ఈ న‌లుగురు నేత‌లు ప‌లు అంశాల‌పై ప్ర‌త్య‌క్షంగా చ‌ర్చిస్తార‌ని వైట్‌హౌజ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. వారి మ‌ధ్య ఉన్న బంధాలు, కరోనాపై పోరాటంలో స‌హ‌కారంతో పాటు ఇండో ప‌సిఫిక్ వాణిజ్యంపై చ‌ర్చిస్తారు.

క్వాడ్ భేటీ త‌ర్వాత ప్రధాని మోదీ 25వ తేదీన న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జ‌న‌ర‌ల్ అసెంబ్లీలో 76వ సెష‌న్ సంద‌ర్భంగా ప్ర‌సంగం చేయ‌నున్నారు. కరోనా నుంచి రిక‌వ‌రీ, పున‌ర్ నిర్మాణం, ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను గౌర‌వించ‌డం లాంటి అంశాల‌ను ఈ ఏడాది థీమ్‌గా యూఎన్ ఎంచుకున్న‌ది.

నిజానికి మార్చిలోనే తొలి క్వాడ్ స‌మావేశాల‌ను బైడెన్ ఏర్పాటు చేశారు. వ‌ర్చువ‌ల్ రీతిలో ఆ స‌మావేశాలు జ‌రిగాయి. ఆ భేటీ ద్వారా చైనాకు బ‌ల‌మైన సందేశాన్ని కూడా పంపారు.