ఎల్జేపీ ఎంపీ ప్రిన్స్ రాజ్ పాశ్వాన్‌పై రేప్ కేసు

లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ (ఎల్జేపీ) ఎంపీ ప్రిన్స్ రాజ్ పాశ్వాన్‌పై ఢిల్లీలో రేప్ కేసు న‌మోదైంది. ఆయ‌న‌తోపాటు మాజీ కేంద్ర‌మంత్రి, దివంగ‌త రామ్‌విలాస్ పాశ్వాన్ త‌న‌యుడు, ఎంపీ చిరాగ్ పాశ్వాన్ పేరు కూడా ఈ ఎఫ్ఐఆర్‌లో న‌మోదు చేయ‌డం గ‌మ‌నార్హం. 

మూడు నెల‌ల కింద‌ట బాధితురాలు ఢిల్లీలోని క‌న్నాట్‌ప్లేస్ పోలీస్ స్టేష‌న్‌లో ప్రిన్స్ రాజ్‌పై ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా కోర్టు ఆదేశాల మేర‌కు ఈ నెల 9న ప్రిన్స్ రాజ్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. త‌న‌ను రేప్ చేయ‌డంతోపాటు త‌న అశ్లీల వీడియోను వైర‌ల్ చేస్తాన‌ని కూడా ప్రిన్స్ రాజ్ బెదిరించార‌ని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

దీనిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేయొద్ద‌ని కూడా ఆయ‌న బెదిరించిన‌ట్లు చెప్పింది. ప్రిన్స్ రాజ్ పాశ్వాన్ చిరాగ్‌కు సోద‌రుడి వ‌ర‌స అవుతారు. పార్టీలో చిరాగ్ పాశ్వాన్ పై గత జూన్ లో తిరుగుబాటు చేసిన ఐదుగురు ఎంపీలలో ప్రిన్స్ రాజ్ ఒకరు. 

ఈ విష‌యాన్ని చిరాగ్ పాశ్వాన్‌కు చెప్పినా ప‌ట్టించుకోలేద‌ని, ఆయ‌న కూడా పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌కూడ‌ద‌ని అన్నార‌ని బాధితురాలు ఫిర్యాదు చేయ‌డంతో చిరాగ్ పేరు కూడా ఎఫ్ఐఆర్‌లో న‌మోదు చేశారు. 

బాధితురాలు గ‌తంలో తాను లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ కార్య‌క‌ర్త‌గా చేసిన‌ట్లు తెలిపింది. త‌న‌కు మ‌త్తు మందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్ప‌డిన‌ట్లు ఆరోపించింది. అయితే త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను ప్రిన్స్ రాజ్ పాశ్వాన్ ఖండించారు. త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్న‌దంటూ బాధితురాలిపై అదే పోలీస్ స్టేష‌న్‌లో గత ఫిబ్రవరిలో తన ఇంటిలో దొంగతనంకు పాల్పడినట్లు ఫిర్యాదు చేయడంతో ఇటువంటి ఆరోపణలు చేస్తున్నట్లు ఆరోపించారు.