కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లకు ఢిల్లీ పిలుపు 

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను తీసుకెళుతూ గెజిట్‌ విడుదల చేసిన కేంద్రం నిర్ణీత గడువు ప్రకారం అక్టోబరు 14 నుంచి ఆ గెజిట్‌ అమలు చేసే అంశంపై చర్చించేందుకు రెండు బోర్డుల చైర్మన్లను ఢిల్లీకి పిలిచింది.  రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయమై తగు రీతిలో స్పందించక పోవడంతో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించడం కోసం సోమవారం 13 తేదీన కేంద్ర జలశక్తి శాఖ అధికారులతో బోర్డుల చైర్మన్లు భేటీ కానున్నారు. 

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులు అక్టోబరు 14వ తేదీన బోర్డుల ఆధీనంలోకి వెళ్లాలి. గెజిట్‌లో షెడ్యూల్‌-2లో పేర్కొన్న ప్రాజెక్టులు బోర్డుల ప్రత్యక్ష నియంత్రణలోకి వెళ్లనుండగా… షెడ్యూల్‌-3లోని ప్రాజెక్టులు పరోక్షంగా బోర్డుల నియంత్రణలో ఉంటాయి. గెజిట్‌ పై తెలుగు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. 

గోదావరి బోర్డు పరిధిలోని ఏ ప్రాజెక్టుపైనా అభ్యంతరాలు లేనందువల్ల ఆ ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. గోదావరిపై ప్రాజెక్టులను తీసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనమేమీ లేదని ఏపీ కూడా వాదిస్తోంది. 

ఇక కృష్ణా జలాలపై పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌, శ్రీశైలం, నాగార్జున సాగర్‌, పులిచింతల ప్రాజెక్టులు మాత్రమే తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ కోరింది. ఆ మేరకే ఆయా ప్రాజెక్టుల ఉద్యోగుల వివరాలను కృష్ణా బోర్డుకు పంపించింది. తెలంగాణకు కూడా కృష్ణా ప్రాజెక్టులను బోర్డుల పరిధిలో చేర్చే విషయంలో అభ్యంతరాలు ఉన్నాయి.

సెప్టెంబరు 1న గెజిట్‌ అమలుపై జరిగిన బోర్డుల ఉమ్మడి సమావేశంలో… ప్రాజెక్టులన్నీ తీసుకొని ఏం చేస్తారంటూ తెలంగాణ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్‌ కూడా ప్రాజెక్టులన్నీ బోర్డుల ఆధీనంలోకి వెళితే నిర్వహణ కష్టమని, వివాదాల్లో ఉన్న ప్రాజెక్టులే తీసుకోవాలని సూచించారు. గెజిట్‌ అమలును వాయిదా వేయాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను కోరారు.

ఉమ్మడి బోర్డుల సమావేశంలో తెలుగు రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలను, వ్యక్తపరచిన అభ్యంతరాలను సోమవారం ఢిల్లీకి వెళ్లే బోర్డుల ఛైర్మన్లు కేంద్రానికి వివరిస్తారు. గెజిట్‌ ప్రకారం గత నెల 14వ తేదీనే సంస్థాగత నిర్మాణంపై నోటి ఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంది. బోర్డులకు ఏపీ మాత్రమే పోస్టుల వివరాలు ఇవ్వగా తెలంగాణ ఇప్పటికీ సమర్పించలేదు.

అనుమతి లేని ప్రాజెక్టుల జాబితా పైనా తెలుగు రాష్ట్రాలకు అభ్యంతరాలు ఉన్నాయి. అక్కర్లేని ప్రాజెక్టులు కూడా పెట్టారని విభజన చట్టం కింద రక్షణ కల్పించిన ప్రాజెక్టులను కూడా అనుమతి లేని ప్రాజెక్టుల జాబితాలో పెట్టారని ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక అనుమతి లేని ప్రాజెక్టులకు ఆర్నెల్లలోపు అనుమతులు తీసుకోవాలని కేంద్రం షరతు పెట్టింది.

 గోదావరిపై ప్రతిపాదిత ప్రాజెక్టుల డీపీఆర్‌లను తెలంగాణ ఇప్పటికే బోర్డులకు, కేంద్రానికి సమర్పించింది. వరద జలాలపై ప్రతిపాదించిన ప్రాజెక్టులకు అనుమతులు ఎట్లా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమయింది. ఇన్ని చిక్కు ముడుల నేపథ్యంలో సోమవారం కేంద్ర జలశక్తి శాఖ వద్ద బోర్డుల ఛైర్మన్లతో జరిగే సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.