లోకేష్ అరెస్ట్ కు పోలీసుల విఫల యత్నం!

గతంలో నరసరావుపేటలో హత్యకు గురైన అనూష కుటుంబ సభ్యులను గురువారం పరామర్శించాలని బయలుదేరిన టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను అరెస్ట్ చేయడానికి గురువారం పోలీసులు విఫల యత్నం చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో లోకేశ్‌ హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకునే సరికి విమానాశ్రయాన్ని పోలీసులు దిగ్బంధించారు.

విమానం దిగి ‘అరైవల్‌’కు చేరుకోగానే లోకేశ్‌ను అడ్డుకున్నారు. మీడియాతో మాట్లాడవద్దంటూ హుకుం జారీ చేశారు. బలవంతంగా వాహనంలోకి ఎక్కించారు. నరసరావుపేట పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసు కాన్వాయ్‌తో ఉండవల్లిలోని లోకేశ్‌ నివాసానికి తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ డీసీపీ హర్షవర్ధన్‌రాజు-లోకేశ్‌ నడుమ వాగ్వాదం జరిగింది.

‘‘ఎమ్మెల్సీగా బాధితులను పరామర్శించేందుకు హక్కు నాకు ఉంది. పోలీసు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ట్రాక్టర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌ తప్ప, నాపై ఎలాంటి కేసులూ లేవు. ముఖ్యమంత్రి కాలర్‌ పట్టుకోమనో.. లేదా కొట్టమనో నేను ఎప్పుడూ చెప్పలేదు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, విలేకరులతో మాట్లాడి వస్తా. శాంతిభద్రతల సమస్య ఎందుకు వస్తుంది?’’ అని లోకేశ్‌  నిలదీశారు.

అయినప్పటికీ వారు లోకేశ్‌ కాన్వాయ్‌ను ఉండవల్లి వైపు తరలించారు. ఆ సమయంలో ఎయిర్‌పోర్టు మెయిన్‌ గేటు వద్ద లోకేశ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులనూ పక్కకు లాగేశారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో లోకేశ్‌ కాన్వాయ్‌ కృష్ణలంక రాణిగారి తోట వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి నేరుగా నరసరావుపేట వెళ్లేందుకు లోకేశ్‌ సిద్ధమయ్యారు. కానీ పోలీసులు అరగంటపాటు నిలిపివేశారు. ఈలోపు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  పోలీసులు వారిని పక్కకు లాగేశారు.

తర్వాత… లోకేశ్‌ తన వాహనాన్ని అశోకచక్రం సర్కిల్‌ వద్ద నుంచి గుంటూరు వైపు మళ్లించేందుకు యత్నించడంతో మళ్లీ అడ్డుకున్నారు. లోకేశ్‌ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రతిఘటించారు. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని లోకేశ్‌ ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారని నిలదీశారు.

అక్కడే ఉన్న టీడీపీ లీగల్‌ సెల్‌, హైకోర్టు న్యాయవాదులు కూడా పోలీసులతో మాట్లాడారు. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే కోర్టులో సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని సూటిగా చెప్పడంతో వెనుకడుగు వేశారు.  మరోవైపు పోలీసులు కారులో ఉన్న లోకేశ్‌ను బలవంతంగా బయటకు లాగి అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఒక పోలీసు అధికారి లోకేశ్‌ చేతులు పట్టుకుని లాగడం కనిపించింది.

దీంతో లోకేశ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే గంటన్నర గడిచిపోవడంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ ఆగిపోయింది. దీంతో పోలీసులు వెనక్కితగ్గారు. అప్పటికప్పుడు సీఆర్‌పీసీ 41(ఏ) నోటీసు తయారు చేసి లోకేశ్‌కు అందించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బలవంతంగా ఆయన కాన్వాయ్‌ను ఉండవల్లిలోని లోకేశ్‌ ఇంటికి తరలించారు. దీంతో సుమారు 3 గంటలపాటు సాగిన తీవ్ర ఉద్రిక్తతకు తెరపడింది.