మత్స్యకారుల భవిష్యత్ ప్రశ్నార్ధకరం చేస్తున్న జగన్ జిఓ 

రాష్ట్రంలో మత్స్యకారుల భవిష్యత్తును ప్రశ్నార్ధకరంగా మార్చేజిఓ  నెం.217 ను వెంటనే రద్దుచేయాని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏపీ బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. మత్స్యకారులు కుల వృత్తి, జీవన విధానం చిన్నా భిన్నంగా మార్చి, వారి భవిష్యత్తు అంధకారంలోకి నెట్టి క్రమేపీ వారిని ఆ వృత్తుల నుంచి బయటకు పంపి కుట్రలో భాగమే ఈ జీవో అని ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖలో నిశితంగా విమర్శించారు.

ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రికి తొమ్మిది ప్రశ్నలను సంధించారు. తరతరాలుగా మత్స వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న లక్షలాది  మత్స్యకార కుటుంబాల జీవితాలను గందరగోళంలోకి నెట్టడమే ఆయన ఉద్దేశ్యంగా అని ప్రశ్నించారు.
లక్షలాది మత్స్యకార కులవృత్తి దారుల కడుపు కొట్టి అంతరంగీకులకు, అనుచ రులకు కడుపు నింపేందుకే,జీవో తెచ్చారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులను  పాలగాళ్ళెగా మార్చే, కొత్త పథకానికి శ్రీకారం చుట్టిందని వీర్రాజు ధ్వజమెత్తారు. మత్స్యకారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు ఈ రాష్ట్రంలో ఎన్ని వందల, వేల కోట్ల రూపాయలు, ఏ పధకం ద్వారా, ఏవిధంగా ఎన్ని వచ్చాయి ఎలా ఖర్చు చేశారో , “ఒక శ్వేతపత్రం” రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని వీర్రాజు డిమాండ్ చేశారు.

గత రెండు సంవత్సరాలుగా ప్రచారాలకు, పత్రికా ప్రకటనలకు పరిమితమైన  పోర్టులు, చేపల వేటకు ఉపయోగించే జట్టీల నిర్మాణాలు ఎన్ని మొదలెట్టారు ? ఎన్ని ప్రారంభించారు ? ఎప్పటికి పూర్తి చేస్తారు ? వాటిని ఎవరి చేతుల్లో పెట్టడానికి ? కాలయాపన చేస్తున్నారని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వం జిఓ ద్వారా మత్స్యకారుల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆయన హెచ్చరించారు.

కేంద్ర ప్రభుత్వం స్వాతంత్య్ర భారత చరిత్రలోనే తొలిసారిగా ఒక ప్రత్యేక మత్స్య మంత్రిత్వ శాఖను, ఏర్పాటు చేసి, తొలి బడ్జెట్ లో 21′ రాష్ట్రాలకు గాను,రూ. 20 వేల కోట్లు కేటాయించడం జరిగిందనే లక్ష్యాన్ని ముఖ్యమంత్రి గ్రహించినట్లు లేరనేది ఆయన తెచ్చిన జీవో ద్వారా స్పష్టమౌతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు విమర్శించారు.

దేశంలోచేపల ఉత్పత్తిని 70 లక్షల టన్నులు సాధించాలని కేంద్రం ప్రణాళికలు రచించింది, దీని వల్ల ఎగుమతులు ఆదాయం ఒక లక్ష కోట్ల రూపాయలకుకు తీసుకుని వెళ్ళడమే కాకుండా, 55 లక్షల మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంటే  ఏపీ ప్రభుత్వం మత్స్యకారుల భవిష్యత్తు మాన్తా కలుపుతున్నదని వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలోనే దాదాపు 900 కి.మీ.పొడవైన సాగర తీరం ఉన్న  మన రాష్ట్రంలో మత్స్యకారులను ప్రోత్సహించడం, మత్స సంపద పెంపొందించచి, విదేశీ మారకద్రవ్యం పెంపొందించే క్రమంలో మన రాష్ట్ర భాగస్వామ్యాన్ని దేశానికి, ప్రపంచానికి చాటాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, వారి హక్కులను హరించే దిశగా పయనిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ధి కోసం  ఏర్పాటు చేసిన ఫైనాన్స్ కార్పొరేషన్లు కు నేటి వరకు ఒక్క నయాపైసా కూడా విడుదల చేయలేదని ఆరోపణలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.  జిఓ నెంబర్ 217 తొలి అడుగు చెరువులకు వర్తించినా, చివరకు నది, సముద్ర తీరంలో కూడా మత్స్య వేటకు అనుమతి ఉంటుందా అనే అనుమానం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ చర్యలు మొత్తం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొంటూ  రాష్ట్రంలోని మత్స్యకారుల హక్కులకు భంగం వాటిల్లే జీవో నెం.217 ను వెంటనే రద్దు చేయాలని వీర్రాజు డిమాండ్ చేశారు. మత్స్యకారులను కలుపుకుని, రాష్ట్ర వ్యాప్తంగా మత్సకారుల హక్కుల పరిరక్షణ కోసం ప్రజా పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.