బైక్‌ రైడింగ్‌ చేస్తూ సాయిధరమ్‌ తేజ్‌కు గాయం

బైక్‌ రైడింగ్‌ చేస్తూ మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు, సినీనటుడు సాయిధరమ్‌ తేజ్‌ శుక్రవారం రాత్రి గాయపడ్డారు. ప్రమాదంలో ఆయన కుడికంటిపై భాగంతో పాటు ఛాతీ భాగంలో గాయాలయ్యాయి. 

సైబరాబాద్‌ కమిషనరేట్‌ రాయదుర్గం పరిధి ఐకియా స్టోర్‌ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తీగల వంతెన వైపు నుంచి ఐకియా వైపు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. బైక్‌తో ఆయన కింద పడిపోవడాన్ని గమనించిన స్థానికులు 108 వాహనానికి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

 ప్రథమ చికిత్స అనంతరం అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను పోలీసులు నటుడు సాయిధరమ్‌ తేజ్‌గా గుర్తించి మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రికి తరలించారు.  ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయితేజ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కాలర్‌ బోన్‌ విరిగిందని శరీరంలోని అంతర్గతంగా గాయాలేవీ లేవని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.

ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని వివరించారు. కాలర్‌ బోన్‌ విరిగిందని అపోలో ఆస్పత్రి వైద్యులు మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతుండగా.. మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు హెల్త్‌ బులెటిన్‌లో తెలిపారు.

ప్రమాద సమాచారం తెలుసుకున్న చిరంజీవి,  జనసేన అధినేత, నటుడు పవన్‌కల్యాణ్‌, సినీ దర్శకుడు త్రివిక్రమ్‌, అల్లు అరవింద్‌, సందీప్‌ కిషన్‌ తదితరులు ఆసుపత్రికి తరలివచ్చారు. వైద్యులతో మాట్లాడిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.అల్లు అరవింద్‌ మీడియాతో మాట్లాడుతూ.. సాయిధరమ్‌ తేజ్‌ క్షేమంగా ఉన్నారని తెలిపారు.

కాగా, సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. అభిమానులెవరూ కంగారుపడొద్దని మెగాస్టార్‌ చిరంజీవి తెలిపారు.  సాయిధరమ్‌ తేజ్‌కు స్వల్పగాయాలయ్యాయని,  ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఓ ట్వీట్ లో తెలిపారు. అభిమానులెవరూ కంగారు పడొద్దని.. త్వరలోనే సాయి ఆరోగ్యంతో తిరిగి ఇంటికి వచ్చేస్తారని పేర్కొన్నారు. 

ప్రమాదం జరిగిన సమయంలో తేజ్ హెల్మెట్ పెట్టుకోవడంతో ప్రాణాపాయం నుండి బైటపడిన్నట్లు చెబుతున్నారు. వేగంగా వెడుతున్న సమయంలో ఇసుక కారణంగా బైక్ స్కిడ్ కావడంతో దానిని అదుపు చేయలేకపోయిన్నట్లు పోలీసులు ప్రాధమికంగా భావిస్తున్నారు.