మంత్రులుగా మహిళలు పనికి రారు

‘మంత్రులుగా మహిళలు పనికి రారు.. వాళ్లు కేవలం జన్మనివ్వడానికే పరిమితం’ అని తాలిబన్ల అధికార ప్రతినిధి సయ్యద్‌ జెక్రుల్లా హషిమి ఓ టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ‘మహిళలు మంత్రులు కాలేరు. ఆమె మెడపై ఏమైనా వస్తువు పెడితే వారు మోయలేరు. మంత్రివర్గంలో మంత్రులు తప్పనిసరి కాదు’ అని పేర్కొన్నాడు.

ముల్లా మొహమ్మద్‌ హసన్‌ అఖుంద్‌ మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేకపోవడంతో  ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా తాలిబన్లకు వ్యతిరేకంగా బుధవారం మహిళలు నిరసన చేపట్టారు. మహిళల నిరసన ప్రదర్శనపై  స్పందిస్తూ ‘ఆ నలుగురు మహిళల నిరసన అఫ్గానిస్తాన్‌ మొత్తం మహిళలు ప్రాతినిథ్యం వహించినట్టుగా భావించొద్దు’ అని పేర్కొన్నారు. 

‘మహిళలకు స్వేచ్ఛనిస్తే ఏం జరుగుతుందో మీకో ఉదాహరణ చెబుతా. రెండు దశాబ్దాలుగా కీలుబొమ్మ పరిపాలన కొనసాగలేదా’ అని ఎదురు ప్రశ్నించాడు. వ్యభిచారం బాగా పెరిగిపోయింది. కార్యాలయాల్లోనే ఏకంగా ఆ వ్యవహారం కొనసాగుతోంది. మహిళలు జనాభాలో సగభాగమని యాంకర్‌ తెలపగా మహిళలు అఫ్గానిస్తాన్‌ ప్రజలను జన్మనివ్వడానికే పరిమితం కావాలని స్పష్టం చేసాడు.

పాక్ పై ఆంక్షలు విధించాలి 

కాగా, పాకిస్థాన్‌పై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉందని దేశ చట్టసభ సభ్యులు అడమ్ కింజింగెర్ డిమాండ్ చేశారు. అఫ్ఘనిస్థాన్‌లో ఇప్పటి కల్లోల పరిస్థితులలో పాకిస్థాన్ వహిస్తున్న పాత్రను బైడెన్ అధికార యంత్రాంగం అత్యంత జాగరూకతతో పర్యవేక్షించాలని ట్వీటు వెలువరించారు.

కేవలం సాయం తాత్కాలికంగా నిలిపివేయడమే కాదు ఈ దేశాన్ని పూర్తిగా తీవ్రస్థాయి ఆంక్షల జాబితాలోకి తీసుకురావల్సి ఉందని స్పష్టం చేశారు. పంజ్‌షీర్‌లో ప్రతిఘటన దళాలను అణచివేసేందుకు తాలిబన్లకు పాకిస్థాన్ బలగాలు పెద్ద ఎత్తున సాయం అందించడంపై అడమ్ స్పందించారు.

తాలిబన్లకు ఈ లోయ ఆపరేషన్ దశలో పాకిస్థాన్ నుంచి 27 హెలికాప్టర్లు అందాయని, వీటిలో అత్యంత సుశిక్షితులైన ప్రత్యేక బలగాలు వచ్చాయని, తోడుగా పాకిస్థానీ డ్రోన్లతో దాడులు కూడా సాగించారని ఫ్యాక్స్‌న్యూస్ వార్త వెలువరించిన తరువాత చట్టసభ సభ్యులు స్పందించారు.