తాలిబన్ల తుపాకులకు బెదరని మహిళల నిరసనలు 

తాలిబన్‌ ఫైటర్ల తుపాకులకు ఆ దేశ మహిళలు భయపడటం లేదు. తాలిబన్‌ ఫైటర్‌ తుపాకీ ఎక్కుపెట్టినప్పటికీ ఒక మహిళ బెదరక నిరసన కొనసాగించింది. ఆఫ్ఘనిస్థాన్‌ తాలిబన్ల వశమైనప్పటి నుంచి ఆ దేశ మహిళలు తమ హక్కులు, ఇతర అంశాలపై గత కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్నారు. 

మహిళలు తమ హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు. వరుసగా నాలుగో రోజు బుధవారం కూడా మహిళలు తమ హక్కులను కాపాడాలంటూ కాబూల్‌ రోడ్లపైకి వచ్చారు. తమ దేశ అంతర్గత వ్యవహారంలో పాకిస్తాన్‌ తలదూర్చడాన్ని కూడా వారు నిరసించారు. పంజ్‌షీర్‌లో పాక్‌ యుద్ధ విమానాల దాడులపై మంగళవారం కాబూల్‌లో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. కాబూల్‌లోని పాక్‌ రాయబార కార్యాలయం ఎదుట ఆ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా తాలిబన్‌ ఫైటర్‌ ఒక మహిళకు తుపాకీ గురిపెట్టాడు. అయినప్పటికీ ఆమె బెదరక తన నిరసన కొనసాగించింది. రాయిటర్స్‌ జర్నలిస్ట్‌ తీసిన ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆఫ్ఘనిస్థాన్‌ మహిళల దృఢ నిశ్చయానికి ఇది నిదర్శమని కొందరు నెటిజన్లు ప్రశంసించారు.

పలు ప్రాంతాల్లో ఆందోళనకు దిగిన మహిళలపై తాలిబాన్‌ పోలీసులు విరుచుకుపడి లాఠీలతో కొట్టారు. తుపాకులు ఎక్కుపెట్టి ఆందోళన విరమించేలా ఒత్తిడి తెచ్చారు. అయినప్పటికీ వారు వినకుండా ఆందోళన కొనసాగించారు.  జనాలను చెదరగొట్టడానికి తాలిబాన్లు మహిళలపై విరుచుకుపడ్డారు. వార్తను కవరేజ్‌ చేయడానికి వచ్చిన ఓ జర్నలిస్టును వాతలు తేలేలా బెల్టుతో కొట్టారు. రోడ్డు మీదుగా వెళ్తున్న బాలికలను కూడా దారుణంగా కొట్టారు.

ఆందోళనలను కవర్‌ చేస్తున్న ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ప్లాట్‌ఫాం ఎటిలాట్ రోజ్‌లోని ముగ్గురు జర్నలిస్టులను తాలిబాన్‌ అదుపులోకి తీసుకున్నది. ఎటిలట్‌ రోస్ ప్రకారం, ఎడిటర్ ఖాదీం హుస్సేన్ కరీమి, రిపోర్టర్ అబెర్ షైగాన్, లోట్‌ఫాలి సుల్తానీలను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కూడా కాబూల్‌లో మహిళల ప్రదర్శనలను కవర్ చేసిన 20 మందికి పైగా జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో చాలా మందిని తీవ్రంగా కొట్టారు.

షరియా చట్టం ప్రకారమే ఆఫ్ఘాన్‌లో పాలన 

షరియా చట్టం ప్రకారమే ఆఫ్ఘాన్‌లో తమ పాలన సాగుతుందని తాలిబన్‌ సుప్రీం నేత హైబతుల్లా అఖుంద్‌జాదా స్పష్టం చేశారు. . భవిష్యత్తులో, ఆఫ్ఘాన్‌ పాలన, జీవితాలకు సంబంధించిన అన్ని విషయాలు షరియా చట్టం ఆదేశాల మేరకు జరుగుతాయని ఓ  ప్రకటనలో తెలిపారు. 

నూతన నాయకత్వ పాలనలో శాంతి, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, తమకు ఎవరితో ఎలాంటి సమస్య లేదని పేర్కొన్నారు. వ్యవస్థను బలోపేతం చేసేందుకు, యుద్ధంలో చితికిపోయిన దేశాన్ని పునర్‌ నిర్మించుకునేందుకు అందరూ భాగస్వాములవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

దేశంలో ఇస్లామిక్‌, షరియా చట్టాలు పాటించడానికి తాము అనుకున్న లెక్కలు ఫలితాలనిస్తాయని దేశ ప్రజలకు హామీనిస్తున్నానని తెలిపారు. విదేశాంగ విధానంపై మాట్లాడుతూ… ప్రపంచంతో దేశం ఆరోగ్యకరమైన సంబంధాలను కోరుకుంటోందని అంటూనే ఇస్లామిక్‌ చట్టాన్ని వ్యతిరేకించని అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. 

దేశంలోని ప్రతిభావంతమైన విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు, వ్యాపారులకు భద్రత కల్పిస్తామని హామీనిచ్చారు. అదేవిధంగా నూతన పాలనలో మీడియా నాణ్యతను మెరుగుపర్చేందుకు కృషి చేస్తామని అఖుంద్‌జాదా చెప్పారు. ప్రసారాల్లో నిష్పాక్షికత కలిగే ఉండేలా చూడటం తమ కర్తవ్యమని త్లెఇపారు. అయితే దేశంలోని మహిళల హక్కులకు సంబంధించిన ఎటువంటి హామీలను ఇవ్వకపోవడం గమనార్హం.