ఆచార్య ముదిగొండకు జివిఎస్ సాహితీ పురస్కారం 

చారిత్రక నవలా చక్రవర్తి, ఆచార్య శిప్రముని పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ ముదిగొండ గురు శివప్రసాద్ కు ఆచార్య జివిఎస్ సాహితీ వార్షిక పురస్కారాన్ని 2021 సంవత్సరానికి గాను ఈ నెల 13న అందజేయనున్నారు. 

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆ రోజు సాయంత్రం జరిగే ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి కిషన్ రావు అధ్యక్షత వహిస్తారు. ప్రొఫెసర్ వెళ్ళండి సత్యానందరావు, ప్రొఫెసర్ సుమతీ నరేంద్ర వంటి ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పురస్కార ప్రధానోత్సవ కమిటీ నిర్వహక్కులు తెలిపారు.

గతంలో తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా, జాతీయ సాహిత్య పరిషద్ అఖిల భారత అధ్యక్షులుగా పనిచేసిన సాహితీ దిగ్గజం ప్రొఫెసర్ జివి సుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా ఈ సాహితీ సత్కారం అందజేస్తున్నారు. 

ప్రొఫెసర్ శివప్రసాద్ ఇప్పటికి 120కు పైగా గ్రంధాలు రచించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేసిన ఆయన అవిశ్రాంతంగా సాహితీ సేవ చేస్తున్నారు. గతంలో గండపెండేరం, కనకాభిషేకం, అక్కినేని వారి చేతుల మీదుగా స్వర్ణకమలం వంటి పలు సత్కారాలను అందుకున్నారు. 

భారతీయ ధర్మ ప్రచారం కోసం దేశ, విదేశాలలో అనేక ప్రసంగాలు చేశారు. జాతీయ సాహితీ పరిషద్ ప్రారంభకులలో కీలక సూత్రధారి.  గత ఏడాది ఈ పురస్కారాన్ని ప్రముఖ వ్యాకరణ విధ్వంసులు, ద్రావిడ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య రవ్వ శ్రీహరికి అందజేశారు. 

బాల్యం నుండి చారిత్రక గ్రంధాలు చదవడం ప్రారంభించి, వాటిపై ఆసక్తి పెంచుకున్న ఆచార్య ముదిగొండను మొదటగా కె ఎం మున్షి రచన `జై సోమనాథ్’ ఆకట్టుకొంది. అయితే ఆయన రచన వ్యాసంగంపై విశ్వనాధ సత్యనారాయణ, నోరి నరసింహశాస్త్రి, అడవి బాపిరాజు వంటి వారి రచనలు ప్రభావం చూపాయి. 

వక్రీకరించిన చరిత్రను సరైన మార్గంలో పెట్టి, తెలుగు పాఠకులకు ఆనాటి సామజిక, రాజకీయ పరిస్థితులపై మంచి అవగాహన కల్పించడంలో ఆయన గ్రంధాలు విశేషంగా సహకరిస్తున్నాయి. ఆయన రచనలో అంతర్లీనంగా తాత్విక సమాలోచనలు కూడా గోచరిస్తుంటాయి. 

తెలుగు భాషలో వామపక్ష ప్రభావంకు గురైన రచనలు చరిత్రను రాజకీయ సిద్ధాంతాల రంగులలో వక్రీకరిస్తున్న సమయంలో తెలుగు రాష్ట్రాలలో సాహిత్యంలో జాతీయ భావాలను  తిరిగి చిగురింపచేసిన కొద్దిమంది రచయితలలో ఆయన ఒకరు. ఆయన భాషాశైలి సరళంగా, సామాన్య పాఠకులకు అందుబాటులో ఉండేవిధంగా, వారిలో ఆలోచనలను కలిగించే విధంగా ఉంటుంది. 

1940 డిసెంబర్ 23న ప్రకాశం జిల్లా ఆకులల్లూరులో జన్మించిన ఆయన 1959లో సికింద్రాబాద్ లోని వెస్లీ హైస్కూల్ లో కొద్దికాలం ఉపాధ్యాయునిగా పనిచేసి, ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేశారు.  ఆయన గ్రంధాలలో కొన్ని:  శ్రీపదార్చన, ఆవాహన, పట్టాభి, రెసిడెన్సీ, శ్రీలేఖ, శ్రావణి, వంశధార, తంజావూరు విజయం, మహాసర్గ, బసవగీత, సమ్రాట్ పుష్యమిత్ర, సగం విరిగిన చంద్రుడు.