వివిధ మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం

విద్య, ఉద్యోగాలలో రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ప్రయోజనాలను అందుకుంటున్నవారిలో అన్ని మతాలవారూ ఉండగా… మళ్లీ ప్రత్యేకంగా మతపరమైన రిజర్వేషన్లు అంటే అది వివిధ మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం తప్ప మరొకటి కాదని సీనియర్  బిజెపి నేత విజయశాంతి ధ్వజమెత్తారు. 
 
కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు తరచూ జనాభా సంఖ్యను మతపరమైన రిజర్వేషన్లతో ముడిపెడుతున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మన దేశాన్ని వేధిస్తున్న ప్రధానమైన సమస్యల్లో ఒకటి అధిక జనాభా కాగా…. తరచూ చర్చకు వస్తున్న మతపరమైన రిజర్వేషన్ల అంశం ఎన్నో వర్గాల్లో కలవరానికి కారణమవుతోందని ఆమె చెప్పారు.
ప్రపంచంలో అధిక జనాభా కలిగిన 2వ దేశంగా ఉన్న భారత్‌లో జనాభా నియంత్రణకు దశాబ్దాల కాలంగా ఎన్ని చర్యలు తీసుకున్నా… నేటికీ ఆ దుష్ప్రభావం ఫలితంగా నిరుద్యోగం, ఆనారోగ్యం తదితర సమస్యలు ఎన్నో వెంటాడుతున్నాయని ఆమె త్లెఇపారు. ఈ సమస్యను కొందరు అర్థం చేసుకున్నప్పటికీ, కొందరు ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల భావితరాలు నష్టపోయే పరిస్థితి నెలకొందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
అందువల్ల యూపీ తరహాలో జనాభా నియంత్రణ చట్టం చేసి కఠినంగా అమలు చేసినప్పుడు మాత్రమే పరిస్థితులు చక్కబడతాయని ఆమె స్పష్టం చేశారు. ఇది ఒక మతాన్ని మాత్రమే ఉద్దేశించినట్లు కాంగ్రెస్ మాట్లాడటం కేవలం దుర్మార్గం అని ఆమె దుయ్యబట్టారు చట్టం మతాలకు అతీతంగా అందరికీ ఒకేలా వర్తిస్తుందన్నది ఎవరికైనా అర్థమవుతుందని ఆమె హితవు చెప్పారు.
వెనుకబడిన వర్గాల ఎదుగుదలకు విద్య, ఉద్యోగాలలో రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ప్రయోజనాలను అందుకుంటున్నవారిలో అన్ని మతాలవారూ ఉండగా… మళ్లీ ప్రత్యేకంగా మతపరమైన రిజర్వేషన్లు అంటే అది వివిధ మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం తప్ప మరొకటి కాదని విజయశాంతి విమర్శించారు.