భారత జట్టుకు నేతృత్వం వహించి దేశానికి అద్వితీయమైన విజయాలు తీసుకొచ్చిన మహేంద్ర సింగ్ ధోని తిరిగి మెంటార్‌గా భారత్ జట్టును నడిపించనున్నారు. టీ20 ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యులతో భారత జట్టును ప్రకటించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ధోని సేవలను వినియోగించుకొంటున్నట్లు వెల్లడించింది.
ఇప్పటి వరకు భారత్ జట్టు కెప్టెన్ లలో అత్యంత విజయవంతమైన ఫలితాలు ఇచ్చిన క్రీడాకారుడిగా ఖ్యాతి గడించిన 40 ఏళ్ళ ధోని, గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్ నుండి విరమించుకొంటున్నట్లు ప్రకటించారు. అయితే ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్ జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్నారు. ఆయన 2019లో చివరిసారిగా ప్రపంచ క్రికెట్ కప్ పోటీలో న్యూజీలాండ్ పై ఆడారు.
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీని టోర్నీకి ఎంపిక చేసింది.
అయితే, స్టాండ్ బై ప్లేయర్లుగా శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ తీసుకుంది. ఇదిలా ఉండగా టీ20 ప్రపంచ కప్ అక్టోబర్ 17 నుంచి యూఏఈలోని నాలుగు వేదికల్లో జరుగనుంది. మస్కట్ దుబాయి, అబుదాబి, షార్జాలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. వాస్తవానికి టీ20 వరల్డ్ కప్ గతేడాది అక్టోబర్ 15 – నవంబర్ 15 మధ్య భారత్‌లో జరుగాల్సి ఉంది. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో తాత్కాలికంగా టోర్నీని ఐసీసీ వాయిదా వేసింది. మరోసారి కొవిడ్ మహమ్మారి విజృంభించడంతో టోర్నీ వేదికను భారత్ నుంచి యూఏఈకి మార్చారు.
More Stories
ఢిల్లీలోని 40కు పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు
పోలీసుల మధ్య కాల్పులు .. ఉదంపూర్లో ఇద్దరు పోలీసులు మృతి
ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగుపడటంతో ఆంక్షల సడలింపు