నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)లో మహిళలను చేర్చుకోవాలని సాయుధ దళాలు నిర్ణయించాయని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం తెలిపింది. ఎన్‌డీఏ ద్వారా పర్మనెంట్ కమిషన్‌కు మహిళలను నియమించుకోవడంపై సాయుధ దళాల ఉన్నత స్థాయి అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
దీని కోసం తగిన విధానం, మౌలిక సదుపాయాలపరమైన మార్పులు అవసరం కాబట్టి ఈ ఏడాది నిర్వహించే పరీక్షలను యథాతథంగా కొనసాగించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. జస్టిస్ ఎస్‌కే కౌల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సమక్షంలో కేంద్ర ప్రభుత్వం తరపున అడిషినల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు.
ఎన్డీయే ద్వారా పర్మనెంట్ కమిషన్‌కు మహిళలను నియమించుకోవడంపై సాయుధ దళాల ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వం కూడా ఇందుకు సానుకూలంగా ఉందన్నారు. దీనికి సంబందించిన మరిన్ని వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.
ధర్మాసనం స్పందిస్తూ, ఈ పనిని తమంతట తామే చేయాలని తాము అనేకసార్లు అధికారులకు చెప్పినట్లు తెలిపింది. సరైన విధానాలను రూపొందించేందుకు అన్నివిధాలుగా వారు తగినవారని తెలిపింది. ఏదీ జరగనపుడు కోర్టు రంగంలోకి దిగుతుందని, ఆ విధంగా ముందుకు రావడం సంతోషకరం కాదని పేర్కొంది.
సాయుధ దళాలే ఈ పనిని తమంతట తామే చేయాలని పేర్కొంది. సాయుధ దళాలు మన దేశానికి గౌరవప్రదమైనవని, అయితే స్త్రీ, పురుష సమానత్వం విషయంలో చేయవలసినది ఇంకా చాలా ఉందని తెలిపింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
అడ్వకేట్ కుష్ కల్రా దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ విచారణ జరుగుతోంది. ఎన్‌డీఏలో మహిళలు చేరకుండా నిరోధించడం సమానత్వ హక్కును ఉల్లంఘించడమేనని పిటిషనర్ ఆరోపించారు.
More Stories
శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత
భారత్ లో ఇంటర్నెట్ వినియోగదారులు 90 కోట్లు
బస్తర్ ప్రాంతంలో 12 మంది నక్సల్స్ హతం!