ఎమ్యెల్సీగా కౌశిక్ రెడ్డి పేరుపై గవర్నర్ అసంతృప్తి!

హుజురాబాద్ ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకొని అక్కడి నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేయాలని తలపడిన కౌశిక్ రెడ్డిని పార్టీలో  చేర్చుకొని,వెంటనే గవర్నర్ కొత్త క్రింద రాష్ట్ర శాసనమండలి సభ్యునిగా నియమించడంకోసం కేసీఆర్ ప్రభుత్వం తీసుకొన్న చర్య పట్ల గవర్నర్   డా. తమిళశై సౌందరరాజన్ అసంతృప్తితో ఉన్నట్లు స్పష్టమైనది. 

టీఆర్ఎస్ తరపున హుజురాబాద్ టికెట్ ఆశించి పార్టీలో చేరిన కౌషిక్ రెడ్డికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. కౌషిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవికి సిఫార్సు చేస్తూ గవర్నర్‌కు ఫైల్ కూడా పంపించారు. అయితే గవర్నర్ తమిళి సై ఆ ఫైల్‌ను హోల్డ్‌లో పెట్టారు. 

తాజాగా ఆ ఫైల్ గురించి గవర్నర్ తమిళి సై మౌనం వీడారు. రాజ్‌భవన్‌లో బుధవారం మీడియాతో మాట్లాడిన గవర్నర్.. కౌషిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవికి సిఫార్సు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాజిక సేవకులకు, ఇతర రంగాల్లో విశేష కృషి చేసిన వారినే ఎమ్మెల్సీకి నామినేట్ చేయడం సరైనదని గవర్నర్ అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వం పంపిన ప్రతిపాదనపై ఆలోచించాల్సి ఉందని, కౌషిక్ రెడ్డి విషయంలో ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తానని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. ఆగస్టు 1న జరిగిన కేబినెట్ భేటీలో కౌషిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది. ఆ వెంటనే అందుకు సంబంధించిన ఫైల్‌ను కూడా రాజ్‌భవన్‌కు పంపించారు.

అయితే అప్పటి నుంచి కౌషిక్ రెడ్డి ఫైల్ పెండింగ్‌లో ఉంది. ఇక ప్రజాకవి గోరేటి వెంకన్న కూడా గవర్నర్ కోటాలోనే ఎమ్మెల్సీ అయ్యారు. ఆయనను ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ ఫైల్ పంపిన మరుసటి రోజే గవర్నర్ తమిళి సై ఆమోదించారు. రాజకీయ నేతగా ఉన్న కౌషిక్ రెడ్డి ఏ రంగంలోనూ విశేష కృషి చేయలేదు కాబట్టి ఆయనకు గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవి లభించకపోవచ్చని తెలుస్తున్నది.