మమతా ఎన్నికల కోడ్ ఉల్లంఘన… బిజెపి ఫిర్యాదు

ప్రతి దుర్గా పూజ కమిటీకి రాష్ట్రం రూ .50 వేలు మంజూరు చేస్తామని ప్రకటించడం ద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటన అనంతరం ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినదని గుర్తు చేశారు.

సెప్టెంబర్ 30న జరిగే భబానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మమతా పోటీ చేస్తారని ఆదివారం అధికార టిఎంసి ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నందిగ్రామ్ సీటు నుండి పోటీచేసి బిజెపి అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓడిపోయినందున, ఆమె ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఉప ఎన్నికలో తప్పక గెలవాలి.

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రతాప్ బెనర్జీ, బలూర్‌ఘాట్ ఎంపి సుకాంత మజుందార్‌తో సహా బిజెపి ప్రతినిధి బృందం మంగళవారం రాష్ట్రంలో ఎన్నికల కమీషన్ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. కోడ్ ఉల్లంఘనకు మమతపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసారు. .

“భబానీపూర్ ఉపఎన్నికలకు టిఎంసి అభ్యర్థి అయిన బెనర్జీ, పూజా కమిటీలకు నగదు రివార్డులను ప్రకటించడం ద్వారా మోడల్ కోడ్ కోడ్‌ను ఉల్లంఘించినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని మేము ఈసీని కోరుతున్నాము. ఉపఎన్నికల్లో ఆమె పాల్గొనకుండా నిరోధించాలి” అని బిజెపి ప్రతినిధి బృందం తెలిపింది. 


కరోనా మహమ్మారి కారణంగా కోల్పోయిన స్పాన్సర్‌షిప్, అదనపు ఖర్చుల నిమిత్తమై రాష్ట్రంలోని ప్రతి దుర్గా పూజ కమిటీకి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వరుసగా రెండవ సంవత్సరం రూ. 50,000 మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సంవత్సరం దుర్గా పూజ నిర్వహించే కమిటీలకు ఉచిత లైసెన్స్‌లతో పాటు పవర్ టారిఫ్‌పై 50 శాతం తగ్గింపును కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హెచ్‌కె ద్వివేది ప్రకటించారు. 
 
కోల్‌కతా, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి అనేక మంది దుర్గా పూజ నిర్వాహకులను సిఎం మమతా బెనర్జీ కలిసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బెనర్జీ గత సంవత్సరం కూడా అన్ని పూజ కమిటీలకు రూ .50,000 మంజూరు చేయడంతో సహా అనేక రాయితీలు ప్రకటించారు.

భాబానీపూర్ లో మమతపై పోటీ చేయడానికి పార్టీ ఆదేశిస్తే తాను సిద్దమే అని బిజెపి ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ప్రకటించారు. అయితే అక్కడినుండి మరొకరు పోటీ చేస్తారని  బెంగాల్ బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తెలిపారు. “సువేందు అధికారి ఇప్పటికే ఆమెను ఓడించారు. ఒకే వ్యక్తి ఆమెను అనేకసార్లు ఎందుకు ఓడించాలి? ఈసారి మరొకరు చేస్తారు” అని ఘోష్ వెల్లడించారు.

“మేము భబానీపూర్ సీటులో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. గెలిచేందుకు పోరాడుతాం. పార్లమెంటరీ కమిటీ ద్వారా అభ్యర్థి పేరు ప్రకటిస్తాము” అని కూడా చెప్పారు.