గణేష్ ఉత్సవాలకోసం ఏపీలో బీజేపీ నిరసనలు 

వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ  ఆంధ్ర ప్రదేశ్ లో  రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, వీహెచ్‌పీ నేతలు, కార్యకర్తలు ఆందోళనా కార్యక్రమాలను నిర్వహించారు. విశాఖ  నగరంలో జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా వున్న గాంధీ విగ్రహం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్‌ను కలసి వినతిపత్రం ఇచ్చారు. 

కలెక్టరేట్‌లోకి వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.  అనంతరం ఏపీ సాధుపరిషత్‌ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద మాట్లాడారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.  విజయవాడ సత్యనారాయణపురంలోనూ వీహెచ్‌పీ నేతలు చవితి ఉత్సవాలపై నిషేధాన్ని తొలగించాలని ధర్నా నిర్వహించారు. 

వినాయక చవితి పండుగ బహిరంగంగా నిర్వహించుకోవడానికి అనుమతి ఇప్పించాలని కోరుతూ.. వీహెచ్‌పీ నేతలు  విజయవాడ వన్‌టౌన్‌లోని వినాయకుడి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏపీ ప్రభుత్వం ప్రవర్తిస్తోందని కేంద్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డ్‌ చైర్మన్‌ వల్లూరు జయప్రకాశ్‌ నారాయణ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంపై భారతీయ బీజేపీ తరఫున హైకోర్టులో పిల్‌ వేశామన్నారు. సినిమా ప్రపంచం దీనిపై స్పందించకపోవడాన్ని వల్లూరు తప్పుపట్టారు.

చవితి పందిళ్లకు అనుమతివ్వాలి

వినాయక చవితి  పందిళ్లు వేసుకొని ఉత్సవాలు నిర్విఘ్నంగా జరుపుకోవడానికి అనుమతించాలని మాజీ మంత్రి, మాజీ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి   లేఖ రాశారు.

 కరోనా నిబంధనలకు లోబడి రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య, విద్యా, వినోద కార్యక్రమాలతో పాటు, రాజకీయ పార్టీలు సమావేశాలు, జయంతి, వర్ధంతి కార్యక్రమాలు జరుపుకుంటున్నాయని, వినాయక చవితి పండుగ జరుపుకుంటే తప్పేంటని కన్నా ప్రశ్నించారు. కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో బిజెపి ప్రతినిధివర్గం రాష్ట్ర గవర్నర్ ను కలసి ఈ విషయమై వినతిపత్రం అందించారు. 

హైదరాబాద్‌లో  ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా, ఈనెల 10 నుంచి తాము వినాయక చవితి వేడుకలు నిర్వహించి తీరుతామని ప్రకటించారు. హిందువుల మనోభావాలను ఏపీ సీఎం జగన్‌ కించపరుస్తున్నారని తెలంగాణలోని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. 

కాగా, విఘ్నాలు తొలగించే వినాయకుడి పండుగకే విఘ్నాలు కల్పించడం మంచిది కాదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హితవు పలికారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, వినాయక చవితి వేడుకలు జరుపుకునేందుకు ప్రజలను అనుమతించాలని   ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. 

ఏ రాష్ట్రం పెట్టని నిబంధనలు ఏపీ ప్రభుత్వం పెట్టడంలో అర్థమేంటని నిలదీశారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్న సమయంలో కూడా మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరిపారని, వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో నిబంధనలు పాటించకుండా భారీ జన సమీకరణలతో నిర్వహించారని లోకేశ్‌ గుర్తు చేశారు.

విగ్రహాలు అమ్మకూడదంటే చావే శరణ్యం!

‘రూ.లక్షలు పెట్టుబడులు పెట్టి, వినాయక విగ్రహాలు తయారు చేశాం. ఇప్పుడు ఉన్నపళంగా ప్రభుత్వం విగ్రహాలు అమ్మకూడదంటే అప్పులపాలై వీధినపడతాం. ఇక మాకు చావే శరణ్యమం’ అంటూ  అనంతపురం పోలీసుల ఎదుట విగ్రహాలు విక్రయించే ఓ మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. 

అనంతపురం రూరల్‌ మండలం సిండికేట్‌ నగర్‌లో కొన్ని కుటుంబాలు ఏటా వినాయక విగ్రహాలు తయారు చేసి, విక్రయిస్తూ జీవిస్తున్నాయి.  ప్రభుత్వం అనుమతి ఇచ్చే వరకు ఈసారి విగ్రహాలు విక్రయించకూడదంటూ స్థానిక పోలీసులు ఆంక్షలు విఽధించారు. అంతటితో ఆగక వారిని స్టేషన్‌కు తరలించారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన మహిళ.. పోలీసులతో వాగ్వాదానికి దిగింది.

‘బొమ్మలు తయారు చేసే వారిని పోలీసు స్టేషన్‌లో వేయాలని ఏ సార్‌ చెప్పారు. కడుపు మంటతో మాట్లాడుతున్నా.. మావాళ్లను వదిపెట్టడంతోపాటు మాకు నష్ట పరిహారం చెల్లించాల్సిందే. రూ.20 లక్షలు వడ్డీకి డబ్బు తెచ్చుకుని, బొమ్మలు తయారు చేశాం” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 పండుగకు నాలుగైదు రోజుల ముందు విగ్రహాలు అమ్మకూడదంటున్నారు. నెల ముందు చె బితే బొమ్మలను తయారు చేసేవాళ్లమే కాదు కదా. ఇప్పుడు అప్పులిచ్చినవారికి ఏం సమాధానం చెప్పాలి. ఇలా అయితే మాకు చావే శరణ్యం. ప్రభుత్వమే కరుణించాలి అంటూ ఆమె కన్నీటిపర్యంతమైంది.