మూడోవేవ్‌ను ఎదుర్కొనేందుకు టీకా ఒక్క‌టే మార్గం

దేశంలోని ప్రతి ఒక్కరూ కరోనా మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు టీకా ఒక్కటే సరైన ప్రత్యాన్మ‌య‌మని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ పరిధిలోని స్వర్ణభారత్‌ ట్రస్ట్ (హైదరాబాద్‌)లో ఉచిత టీకాకరణ కార్యక్రమాన్ని ఉప రాష్ట్రపతి దంపతులు ప్రారంభించారు. 
 
ఉభయ తెలుగు రాష్ట్రాలలోని 3 కేంద్రాలలో( హైదరాబాద్‌, నెల్లూరు, విజయవాడ) ఏకకాలంలో ఈ టీకా కార్య‌క్ర‌మం ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా సుమారు 5,000 మందికి టీకాలు వేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కరోనాతో సాగుతున్న పోరాటంలో కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని చేపడుతోందని కొనియాడారు. దీన్ని ప్రజాఉద్యమంలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని విజయవంతం చేయాలని సూచించారు. 
 
దేశంలో గత ఆగస్టు లో 50 శాతం టీకాలు పూర్తి చేయడం ఎంతో గర్వకారణమని తెలిపారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు శారీరక శ్రమ, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం, యోగ, ధ్యానం, ఆధ్యాత్మిక చింతన అలవరచుకోవాలని వివరించారు. అదే విధంగా వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ ప్రభుత్వాలు, నిపుణుల సూచనలు తప్పక పాటించాలని పేర్కొన్నారు.
 
టీకాకరణ కార్యక్రమాన్ని నిర్వహించిన స్వర్ణభారత్‌ ట్రస్టు నిర్వహకులు, భారత్‌ బయోటిక్‌, ముప్పవరపు ఫౌండేషన్‌, మెడిసిటీ హాస్పిటల్స్ ​‍(హైదరాబాద్‌), సింహపురి వైద్య సేవాసమితి, పిన్నమనేని సిద్దార్థ హాస్పిటల్స్​‍ వారిని అభినందిం చారు. 

టీకాకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న అపోహలు, ఆందోళనలను పరిష్కరించడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఆయన సూచించారు. టీకా తీసుకోవడం ద్వారా ఒకవేళ కరోనా సోకినా తీవ్రమైన ఆరోగ్య  సమస్యలు తలెత్తకుండా, ఆసుపత్రి పాలయ్యే పరిస్థితి తప్పుతుందన్న నిపుణుల సూచనలను, పలు అధ్యయనాల నివేదికలను ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు.

ప్రజాప్రతినిధులు, కళాకారులు, క్రీడాకారులు ఇలా ప్రతి ఒక్కరూ టీకా విషయంలో ప్రజల్లో నెలకొన్న అపోహల్ని పోగొట్టేందుకు, టీకాకరణ ప్రక్రియ సక్రమంగా సాగేలా చొరవ తీసుకోవాలని సూచించారు. పత్రికలు కూడా ఈ విషయంలో తమ పాత్రను సమర్థవంతంగా పాటించాలన్నారు.

‘వసుధైవ కుటుంబకం’ విధానం స్ఫూర్తితో విదేశాలకు సైతం మన టీకాలు పంపిణీ చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇదే విధంగా వివిధ రంగాల్లో ఆత్మనిర్భరతను కనబరుస్తూ, దేశం మరింత ప్రగతి సాధించే ప్రయత్నంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగం పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

విశ్వమానవాళిపై కరోనా చూపించిన ప్రతికూల ప్రభావాన్ని, వందేళ్లలో ఎన్నడూ చూడని పరిస్థితులను గుర్తుచేస్తూ, ఈ అసాధారణ సంక్షోభాన్ని అసాధారణ రీతిలోనే ఎదుర్కోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు.