
తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో మంగళవారం ఐదు జిల్లాల్లో, బుధవారం మరో నాలుగు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరిక జారీ చేసింది. వీటిలో మంగళవారం పెద్దపల్లి, జయశకంర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురవనుండగా, బుధవారం ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురవనున్నాయి.
ఇవే కాకుండా పలు ఇతర జిల్లాల్లోనూ రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ కె.నాగరత్న తెలిపారు. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండగా, చెరువులు మత్తడి దుంకుతున్నాయి. వానల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సోమవారం రాత్రి వరకు అన్ని జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తన ప్రభావంతో వాయవ్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరంలోని అల్పపీడనం ఆగ్నేయ దిశగా తూర్పు, మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా వెళ్లే అవకాశం ఉందన్నారు.
మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి దిగువకు 7 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో సోమవారం వాన దంచికొట్టింది. ఈ ప్రాంతాల్లో పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్లు తెగిపోవడంతో.. ఆయా గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 31 అడుగులకు చేరింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని సిడబ్ల్యూసి అధికారులు తెలుపుతున్నారు. జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
More Stories
హైదరాబాద్ లో పురుషాంగం పునఃసృష్టి
బీసీ కులగణన కాంగ్రెస్ కుట్ర
పాలమూరు- రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేం