ఆలయం తొలగింపుపై ఫిలింనగర్‌లో ఉద్రిక్తత

హైదరాబాద్ లోని  ఫిలింనగర్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హనుమాన్ ఆలయం తొలగింపుపై హిందూ సంఘాల కార్యకర్తలు నిరసనకు దిగారు. ఆలయం వద్దకు చేరుకుని దర్శనానికి అనుమతించాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులను నెట్టేసి దూసుకెళ్లారు. 
 
దీంతో పోలీసులకు హిందూ సంఘాలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసుల ముందే ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ యువకుడితో పాటు 150 మంది హిందూ సంఘాల కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు.
 
హైదరాబాద్ లోని షేక్‌పేట సర్వే నెం 403 లోని పురాతన అభయాంజనేయ స్వామి ఆలయాన్ని రక్షించడానికి వెళ్ళిన విశ్వహిందూ పరిషద్ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు, భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్, పూజ్య శివస్వామి తో పాటు వందలాది మందిని అరెస్ట్ చేశారు. 
 
 వారందరిని బేషరతుగా విడుదల చేయాలని విశ్వహిందూ పరిషద్ డిమాండ్ చేసింది. దర్శనాలకు వెలుతున్న భక్తులను కూడా అరెస్టు చేసిన పోలీసులలో ఏ ఒక్కరికి పేరును సూచించే బోర్డు లేదని, భక్తులు,మహిళలు ప్రశ్నిస్తుంటే వారి దగ్గర సమాధానం లేదని పరిషద్ రాష్ట్ర అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ విస్మయం వ్యక్తం చేశారు.
వాళ్ళు పోలీసులా?లేదండే ఖాకీ డ్రెస్సులు వేసుకున్న భూ మాఫియా గ్యాంగ్ సభ్యులా?హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దేవుని దర్శనానికి వెళ్ళే భక్తులను ఆపే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు.   పురాతన ఆలయాన్ని తొలగించిన వ్యక్తులను అరెస్టు చేయాలని, దేవాలయాన్ని యధాతధంగా పునః నిర్మించాలని పరిషద్ డిమాండ్ చేసింది.
ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిస్తామని హెచ్చరించింది. రూ 1400 కోట్ల విలువైన భూములను భూమాఫియా కొల్లగొట్టే ప్రయత్నాలను కూడా చట్ట ప్రకారం అడ్డుకొంటామని స్పష్టం చేస్తూ పోలీసులు భూ మాఫియాకు కొమ్ముకాయకుండా చట్టప్రకారం విధులు నిర్వహించాలని హితవు చెప్పింది.