అఫ్ఘాన్ మీడియాపై తాలిబన్ల నిషేధం… పాక్ సైనికుల మృతి 

అఫ్ఘానిస్థాన్ దేశంలో అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు తాజాగా మీడియాపై కూడా నిషేధం విధించారు. తాలిబన్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు కోసం పిలుపునిచ్చిన పంజ్‌షీర్ నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ (ఎన్‌ఆర్‌ఎఫ్) నాయకుడు అహ్మద్ మసౌద్ సందేశాన్ని ప్రసారం చేయకుండా అఫ్ఘాన్ వార్తా మాధ్యమాలను తాలిబన్లు నిషేధించారు.
 
మరోవంక, పంజ్‌షీర్‌లో పాకిస్థాన్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఆఫ్ఘ‌నిస్థాన్‌ను కైవ‌శం చేసుకున్న తాలిబ‌న్ల‌కు మ‌ద్ద‌తుగా పాకిస్థాన్ సేన‌లు రంగంలోకి దిగాయి. ఈ సంద‌ర్భంగా నార్త‌ర్న్ అల‌యెన్స్ సైనికుల‌కు, తాలిబ‌న్ల‌కు మ‌ధ్య జ‌రిగిన కాల్పుల్లో 22 మంది పాక్ సైనికులు మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తున్న‌ది. 
తాలిబ‌న్ల‌పై తిరుగుబాటు చేయాల‌ని ఆఫ్ఘ‌న్ల‌కు నార్త‌ర్న్ అల‌య‌న్స్‌కు చెందిన అహ్మ‌ద్ మ‌సూద్ పిలుపునిచ్చారు. మ‌రోవైపు, పంజ్‌షీర్ పోరులో తాలిబ‌న్ల‌కు మ‌ద్ద‌తుగా పాక్ పాల్గొన‌డంపై ఇరాన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పాక్ త‌న వైమానిక ద‌ళాల‌ను ఉప‌సంహ‌రించాల‌ని హెచ్చ‌రించింది. లేనిప‌క్షంలో తీవ్ర ప‌రిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది.
కాగా,  ప్రభుత్వ ఏర్పాటులో తాలిబన్‌లు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ సలహాలు, సూచనలు, సహకారం తీసుకుంటున్నట్లు తెలుస్తున్న‌ది. ఐఎస్‌ఐ సూచనల ప్రకారమే తాలిబన్‌లు వ్యవహరిస్తున్నట్లు తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతున్న‌ది. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే విషయమై తాలిబ‌న్‌ ప్రతినిధులు పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ చీఫ్ ఫైజ్ హమీద్‌తో భేటీ అయ్యారు.
అఫ్ఘాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, హై కౌన్సిల్ ఫర్ నేషనల్  మాజీ ఛైర్మన్ అబ్దుల్లా అబ్దుల్లాలు తోటి పౌరులతో కలవకుండా తాలిబన్లు అడ్డుకున్నారు.అహ్మద్ మసౌద్ సోమవారం తాలిబన్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు కోసం పిలుపునిచ్చారు. ‘‘మీరు ఎక్కడ ఉన్నా మన దేశ గౌరవం, స్వేచ్ఛ, శ్రేయస్సు కోసం జాతీయ తిరుగుబాటును ప్రారంభించాలని నేను మిమ్మల్ని పిలుస్తున్నాను’’ అని నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ కమాండర్ అహ్మద్ మసౌద్ మీడియాకు పంపిన ఆడియో సందేశంలో కోరారు.
 
తిరుగుబాటుపై పంజ్ షీర్, తాలిబన్ల మధ్య పరస్పర విరుద్ధమైన నివేదికలు వెలువడ్డాయి.తాలిబన్లు  పంజ్ షీర్ ప్రావిన్స్‌ని విడిచిపెడితే తాను పోరాటాన్ని నిలిపివేసి చర్చలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నానని మసౌద్ చెప్పారు.
 
అప్గానిస్థాన్‌లో కొన్ని రాష్ట్రాలలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు తెరుచుకొన్నాయి. తరగతి గదుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరినొకరు చూసుకోకుండా మధ్యలో పరదాలు ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ప్రైవేటు యూనివర్సిటీల్లో చదివే యువతులు తప్పకుండా నిఖాబ్‌ ధరించాలని తాలిబన్లు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు.
 
కాగా,  అఫ్గానిస్థాన్‌ పరిణామాలపై చర్చించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా సమావేశంలో పాల్గొన్నారు. అఫ్గాన్‌లో నెలకొన్న పరిస్థితులు, తాలిబన్ల నాయకత్వంపై అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం.