50 ఏళ్ల నిరీక్షణకు తెర.. టీమిండియా ఘన విజయం

భార‌త్, ఇంగ్లండ్ మ‌ధ్య జ‌రుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా చ‌రిత్ర సృష్టించింది.368 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది.  టీమిండియా జట్టుగా రాణించి ఓవల్‌ గడ్డపై 50 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది.  ఓవ‌ల్ స్టేడియంలో 1971 త‌ర్వాత ఇంగ్లండ్‌ను ఓడించింది. ఇనేళ్లకు కోహ్లి నేతృత్వంలో భారత్‌ 157 పరుగుల భారీ తేడాతో చారిత్రక విజయం సాధించింది.
 
 ఉమేశ్‌ బౌలింగ్‌లో ఆండర్సన్‌(2) ఔట్‌ కావడంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌కు 210 పరుగుల వద్ద తెరపడింది. భారత బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్‌ 3 వికెట్లు తీయగా బుమ్రా, శార్దూల్‌, జడేజా తలో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ పతనాన్ని శాశించారు. ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
 
బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడిలోకి నెట్టి వికెట్లు కూలుస్తూ భారత్‌కు అద్వితీయ విజయాన్ని అందించారు. తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌటై ఉసూరుమనిపించినప్పటికీ రెండో ఇన్నింగ్స్‌లో నిలదొక్కుకుని 466 పరుగులు చేసి ఇంగ్లండ్ ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది. రోహిత్ శర్మ (127)తో అదరగొట్టగా, పుజారా (61), పంత్ (50), ఠాకూర్ (60) అర్ధ సెంచరీలతో రాణించారు. చివర్లో ఉమేశ్ యాదవ్ (25), బుమ్రా (24) కాసేపు బౌలర్లను ఎదురొడ్డడంతో భారత్ 466 పరుగులు చేయగలిగింది.   
 
తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 191 ప‌రుగులు చేయ‌గా.. ఇంగ్లండ్ 290 ప‌రుగులు చేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో భార‌త్ 466 ప‌రుగులు చేసి.. ఇంగ్లండ్‌కు 368 ప‌రుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. అయితే  ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 210 ప‌రుగులే చేసి కుప్ప‌కూలిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో 127 ప‌రుగులు చేసి భారత్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ ద‌క్కింది.చివరి టెస్టు ఈ నెల 10న మాంచెస్టర్‌లో జరగనుంది.