ముస్లిం నాయకులు తీవ్రవాదాన్ని ధృడంగా వ్యతిరేకించాలి

తెలివైన ముస్లిం నాయకులు  ఛాందసవాదులకు, తీవ్రవాదులకు  వ్యతిరేకంగా ధృడమైన వైఖరి తీసుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ పిలుపిచ్చారు.  ప్రతీ భారతీయ పౌరుడు హిందువేనని, హిందువులు, ముస్లింలు ఒకేరకమైన వారసత్వాన్ని కలిగి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. 

“ఇస్లాం ఆక్రమణదారులతో భారతదేశానికి వచ్చింది. ఇది చారిత్రక వాస్తవం.  దీనిని అలా పేర్కొనడం అవసరం. ముస్లిం సమాజంలోని తెలివైన నాయకులు తీవ్రవాదాన్ని వ్యతిరేకించాలి. మతోన్మాదులకు వ్యతిరేకంగా వారు గట్టిగా మాట్లాడాలి. ఈ పనికి దీర్ఘకాలిక ప్రయత్నం, సహనం అవసరం”  అని స్పష్టం చేశారు. 

ఇది మనందరికీ సుదీర్ఘమైన,  కఠినమైన పరీక్ష అవుతుందని తెలిపారు. మనం ఈ ప్రయత్నం ఎంత త్వరగా ప్రారంభిస్తే, అది మన సమాజానికి తక్కువ నష్టం కలిగిస్తుందని భగవత్ చెప్పారు. పూణేకి చెందిన గ్లోబల్ స్ట్రాటజిక్ పాలసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముంబై నగరంలో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులలో ప్రధానంగా కాశ్మీరీ విద్యార్థులు, రిటైర్డ్ రక్షణ అధికారులు, ముస్లిం మేధావులు ఉన్నారు.

ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ స్వాధీనంపై భారతీయ ముస్లింలు ఎలా స్పందించాలి అనేదానిపై ముస్లిం సమాజంతో సహా దేశంలో చర్చ జరుగుతున్న సమయంలో ఈ సమావేశం జరిగింది. కవి, పాటల రచయిత జావెద్ అక్తర్ గత వారం ఆర్‌ఎస్‌ఎస్ ను తాలిబాన్‌లతో పోలుస్తూ వివాదాస్పద వాఖ్యలు చేసిన సమయంలో జరిగిన ఈ సమావేశం విశేష ప్రాధాన్యత నెలకొంది.

“భారతదేశంలో హిందువులు, ముస్లింలు ఒకే వంశాన్ని పంచుకుంటారు. మా అభిప్రాయం ప్రకారం, హిందూ అనే పదానికి మాతృభూమి,  ప్రాచీన కాలం నుండి మనకు సంక్రమించిన సంస్కృతి అని అర్ధం. హిందూ అనే పదం ప్రతి వ్యక్తిని వారి భాష, సమాజం లేదా మతంతో సంబంధం లేకుండా సూచిస్తుంది” అని భగవత్ తెలిపారు. 

దేశంలోని ప్రతి ఒక్కరూ హిందువులే అని స్పష్టం చేస్తూ ఈ సందర్భంలోనే మనం ప్రతి భారతీయ పౌరుడిని హిందువుగా చూస్తామని,  మరొకరి విశ్వాసంను అగౌరవపరచమని స్పష్టం చేశారు. అయితే,  అందుకోసం మనం ముస్లిం ఆధిపత్యం గురించి కాకుండా భారతదేశ ఆధిపత్యం గురించి ఆలోచించాలని సూచించారు. దేశం పురోగతి చెందాలంటే, అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. 

హిందూ – ముస్లింలను విభజించిన బ్రిటన్ 
 
భారతదేశంలో నివసిస్తున్న హిందువులు, ముస్లింలు ఒకే పూర్వీకు కలిగున్నా బ్రిటిష్ వారు అపోహలను సృష్టించడం ద్వారా వారిని విభజించారని ఆర్ ఎస్ ఎస్ అధినేత ఆరోపించారు. హిందువులతో కలిసి జీవించాలని నిర్ణయించుకుంటే తమకు ఏమీ లభించదని బ్రిటిష్ వారు ముస్లింలకు చెప్పారని భగవత్ పేర్కొన్నారు.

“బ్రిటిష్ వారు ముస్లింలకు హిందువులు మాత్రమే ఎన్నికలలో గెలుస్తుంటారని, తమకోసం ప్రత్యేక (దేశాన్ని) డిమాండ్ చేయమని వారిని ప్రోత్సహించారు. ఇస్లాం భారతదేశం నుండి కనుమరుగైపోతుందని వారు చెప్పారు. అది జరిగిందా? లేదు. ముస్లింలు అన్ని పదవులను నిర్వహించవచ్చు” అని గుర్తు చేశారు.

ముస్లింలు తీవ్రవాదులని బ్రిటిషర్లు హిందువులకు చెప్పారని అంటూ వీరిద్దరూ పోట్లాడుకొనే విధంగా వారు చేశారని, అటువంటి పోట్లాటలు వారిమధ్య అవిశ్వాసం పెంచాయని, ఒకరినొక్కరిపై దూరం పెరిగేందుకు కారణమైనదని ఆయన వివరించారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, ఈ రెండు వర్గాలు కలిసి నడవాల్సిన అవసరం ఉందని డా. భగవత్ స్పష్టం చేశారు. “మన  ఐక్యతకు ఆధారం మన మాతృభూమి. అద్భుతమైన సంప్రదాయం. భారతదేశంలో నివసిస్తున్న హిందువులు, ముస్లింల పూర్వీకులు ఒకటే” అని ఆర్ఎస్ఎస్ అధినేత తెలిపారు.

“హిందూ” అనే పదాన్ని నిర్వచిస్తూ, “నా దృక్కోణంలో, హిందూ అనే పదం మాతృభూమి, పూర్వీకులు  భారతీయ సంస్కృతి వారసత్వానికి చిహ్నం” అని చెప్పారు. “‘హిందూ’ అనేది ఒక కులం లేదా భాషా నామవాచకం కాదు, కానీ ఇది ప్రకృతి  ప్రతి వ్యక్తి  అభివృద్ధి, ఉద్ధరణకు మార్గనిర్దేశం చేసే సంప్రదాయం పేరు. భాష,  మతంతో సంబంధం లేకుండా, ఏది నమ్ముతారో అది హిందూ.  ఈ సందర్భంలో, మేము ప్రతి భారతీయ పౌరుడిని హిందువుగా భావిస్తాము” అని స్పష్టం చేశారు. 

కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ వైవిధ్యం, బహుళత్వాన్ని గౌరవించాలని కోరారు.  “ప్రపంచంలో ఎక్కడ వైవిధ్యం నాశనమైందో అక్కడ నాగరికతలు అదృశ్యమయ్యాయి. ఎక్కడ  వైవిధ్యం సంరక్షించబడి. ఆ ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందుతాయి” అని ఆయన చెప్పారు. “భారతీయ సంస్కృతి ఎవరినీ ‘మరొకరు’ గా పరిగణించదని,  ఎందుకంటే అందరిని ఒకే విధంగా భావిస్తోందని ఆయన పేర్కొన్నారు. 

  “దేశం మొదట, అన్నింటికన్నా మించి దేశం” అంశంపై జరిగిన సమావేశంలో కశ్మీర్‌లోని సెంట్రల్ యూనివర్శిటీ ఛాన్సలర్, రిటైర్డ్  లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్ మాట్లాడుతూ  ఈ సమావేశం ఏర్పాటు గురించి చాలా కాలం క్రితం అనుకున్నామని, అయితే పరిణామాల నేపథ్యంలో ఇది సమయోచితంగా మారిందని అంటూ తాజా ఆఫ్ఘన్ పరిణామాలు, జావేద్ అక్తర్ వాఖ్యాలను ప్రస్తావిస్తూ తెలిపారు.  

1971 యుద్ధం తరువాత, పాకిస్తాన్ భారత దేశమో నెత్తురు పారేటట్లు చేయడంకోసం ఒక గొప్ప వ్యూహాన్ని అమలు చేసింది, అయితే ప్రభుత్వం, సైన్యం, పోలీసులు. కాశ్మీరీ ప్రజలు ఈ కుట్రను ఓడించారని కొనియాడారు.