నిష్పాక్షిక‌, సంఘ‌టిత విద్య‌తోనే దేశం అభివృద్ధి

ఏ దేశ‌మైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో విద్య నిష్పాక్షికంగా, సంఘ‌టిత‌మైన‌దిగా ఉండాలని ప్ర‌ధాని నరేంద్ర‌మోదీ చెప్పారు. విద్య అనేది కేవ‌లం సంఘ‌టిత‌మైన‌దిగా ఉంటే స‌రిపోద‌ని, నిష్పాక్షిక‌మైన‌దిగా కూడా ఉండాల‌ని ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు. అందుకోస‌మే మ‌న దేశంలో టాకింగ్ బుక్స్‌, ఆడియో బుక్స్‌ను కూడా విద్య‌లో భాగం చేశామ‌ని ప్ర‌ధాని చెప్పారు. 

యూనివ‌ర్స‌ల్ డిజైన్ లెర్నింగ్ (యూడీఎల్‌)ను ఆధారంగా చేసుకుని దేశంలో ఇండియ‌న్ సైన్ లాంగ్వేజ్ డిక్ష‌న‌రీని రూపొందించార‌ని తెలిపారు. పాఠశాల నాణ్యత భరోసా, సీబీఎస్ఈ మదింపు నిబంధనావళి చాలా ఉత్తమమైనదని పేర్కొన్నారు.

 ఇప్పటి వరకు పాఠశాలలు, విద్య కోసం సాధారణ శాస్త్రీయ నిబంధనావళి మన దేశంలో లేదని, ఈ పరిస్థితి ఇప్పుడు మారిందని చెప్పారు. సాంకేతిక నైపుణ్యం ఈ రోజుల్లో చాలా అవసరమని, నిష్ఠ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వల్ల ఉపాధ్యాయులు తమ సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవడానికి వీలవుతుందని చెప్పారు. 

విద్యార్థులు భవిష్యత్తులో క్రీడా రంగాన్ని ఎంచుకునే విధంగా ప్రోత్సహించడం కోసం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా 75 పాఠశాలలను సందర్శించాలని ఒలింపియన్లు, పారాలింపియన్లను తాను కోరానని చెప్పారు. ఇండియ‌న్ సైన్ లాంగ్వేజ్‌ను పాఠ్యాంశాల్లో ఒక స‌బ్జెక్టుగా చేర్చ‌డం దేశంలోనే మొద‌టిసారి అని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ చెప్పారు. ఢిల్లీలో ఇవాళ శిక్ష‌క్ ప‌ర్వ్ కాంక్లేవ్ ప్రారంభం సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ ఐదు ఆవిష్క‌ర‌ణ‌ల‌ను లాంచ్ చేశారు. ఇండియ‌న్ సైన్ లాంగ్వేజ్ డిక్ష‌న‌రీ (చెవిటి విద్యార్థుల కోసం), టాకింగ్ బుక్స్ (అంధ విద్యార్థుల కోసం)ను ఆవిష్క‌రించారు. స్కూల్ క్వాలిటీ అస్యూరెన్స్ అండ్ అసెస్‌మెంట్ ఫ్రేమ్‌వ‌ర్క్ ఆఫ్ సీబీఎస్ఈ , నిష్ఠ టీచ‌ర్స్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్ ఫ‌ర్ నిపుణ్ భార‌త్‌ను ప్రారంభించారు.   విద్యాంజ‌లి పోర్ట‌ల్‌ను, స్కూల్ క్వాలిటీ అసెస్‌మెంట్ అండ్ అస్యూరెన్స్ ఫ్రేమ్ వ‌ర్క్ ప్రారంభించారు.