ఆర్ఎస్ఎస్ ను తాలిబన్లతో పోల్చడంపై శివసేన ఆగ్రహం

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ)లను తాలిబన్లతో  ప్రముఖ రచయిత జావెద్ అఖ్తర్‌ పోల్చడం పట్ల శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది.  దేశంలోని ఏ సంస్థలనైనా తాలిబన్లతో పోల్చడం  అని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్నితమ దినపత్రిక ‘సామ్నా’లో తాము పేర్కొన్నట్టు చెప్పారు. 
 
దేశంలోని ఏ సంస్థను తాలిబన్లతో పోల్చడం తగదని పేర్కొంటూ  భారతదేశం ప్రజాస్వామ్య దేశమని, తాలిబన్ల దుర్మార్గ ప్రవర్తన ఇక్కడ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. ఇక్కడి విపక్ష పార్టీలు ఎమర్జెన్సీ కూడా చవిచూశాయని గుర్తు చేసారు. తాలిబన్లను హిందుత్వతో పోల్చడం హిందూ సంస్కృతిని అగౌరవపరచడమేనని శివసేన అధికర పత్రిక ‘సామ్నా’ సంపాదకీయం జావెద్ అఖ్తర్‌పై మండిపడింది.
ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ సిద్ధాంతాలను తాలిబన్ విధానాలతో పోల్చే ప్రజలు పునరాలోచించుకోవాలని సూచించింది. దేశంలోని అత్యధిక జనాభా సెక్యులర్ వాదులని, ఇతర మతాల అభిప్రాయాలను కూడా గౌరవిస్తుంటారని, తాలిబన్ల ఐడియాలజీని ఏమాత్రం అంగీకరించరని స్పష్టం చేసింది. ”హిందూ మెజారిటీ దేశం భారతదేశం. ఎంతో గర్వించదగిన సెక్యులర్ దేశం ఇది” అని సామ్నా సంపాదకీయం పేర్కొంది. 
“ఆర్‌ఎస్‌ఎస్,  విహెపి వంటి సంస్థలకు, హిందుత్వం ఒక సంస్కృతి. హిందువుల హక్కులను అణచివేయరాదని వారు కోరుకుంటున్నారు. అంతేకాకుండా, వారు మహిళల హక్కులపై ఏ విధమైన ఆంక్షలను విధించడంలేదు. కానీ ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. చాలామంది భయంతో సొంతదేశం నుండి పారిపోయారు. మహిళల హక్కులు అణచివేస్తున్నారు”అని సంపాదకీయం పేర్కొంది.

“భారత దేశ జనాభాలో అత్యధికులు లౌకికవాదులు.  ఒకరికొకరు మతపరమైన అభిప్రాయాలను గౌరవిస్తారు. ‘తాలిబానీ భావజాలాన్ని’ మేము అంగీకరించలేము. భారతదేశం హిందూ జనాభాలో అత్యధికులుగా ఉన్నప్పటికీ, ఇది గర్వించదగిన లౌకిక దేశం, “అని శివసేన స్పష్టం చేసింది. 

కాగా, జావేద్‌ వ్యాఖ్యలను విశ్వ హిందూ పరిషిత్‌ ఖండించింది. సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా కుట్రపూరితమైన ఆరోపణలు చేస్తున్నారంటూ జావేద్‌పై వీహెచ్‌పీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలిబన్లు  మహిళల పట్ల వ్యతిరేక ధోరణి గలిగినవారు, హింసను ప్రేరింపించే ఒక ఉగ్రవాద సంస్థ అని గుర్తు చేశారు. అటువంటి సంస్థలతో ఆర్‌ఎస్‌ఎస్‌, బజరంగ్‌దళ్‌, వీహెచ్‌పీలకు పోలికేమిటీ అంటూ దుయ్యబట్టారు. సమాజంలో ఒక ప్రముఖ స్థానంలో ఉన్నవాళ్లు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఎద్దేవా చేశారు. జావేద్‌ అక్తర్‌పై కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా వీహెచ్‌పీ నేతలు కోరారు.

అక్తర్ ఆర్‌ఎస్‌ఎస్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లు ఏవిధంగా ఇస్లామిక్‌ రాజ్యం కోసం పోరాడుతున్నారో అదే మాదిరి ‘హిందూ దేశ స్థాపన కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ పని చేస్తోంది’ అని జావేద్‌ అక్తర్‌ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. జావేద్‌ అక్తర్‌ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాలు కూడా చేశారు. ముంబైలోని ఆయన నివాసం ఎదుట ఆదివారం బిజెపి కార్యకర్తలు నిరసన ప్రదర్శన జరిపారు.