దేశ ప్రత్యర్థి చేతిలో బీకేయూ నేత రాకేష తికాయత్ !

దేశ ప్రత్యర్థి చేతిలో బీకేయూ నేత రాకేష తికాయత్ ఒక ఉపకరణంలా మారుతున్నారని  కేంద్ర మంత్రి సంజీవ్ బల్యాన్ తప్పుపట్టారు. పాకిస్థాన్ నుంచి రైతులు ప్రశంసలను రైతులు కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. సాన్ మహాపంచాయత్‌ను ”రాజకీయ సమీకరణ”గా ఆయన అభివర్ణించారు. 

బల్యాన్ పార్లమెంటరీ నియోజకవర్గంలో సోమవారంనాడు జరిగిన ‘కిసాన్ మహా పంచాయత్’కి భారీగా జనం రావడం, తొమ్మిది నెలలుగా తాము చేపడుతున్న ఆందోళనల్లో ఇదే అతిపెద్ద కార్యక్రమమని రైతు నేతలు ప్రకటించిన నేపథ్యంలో బల్యాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం ద్వారా పాకిస్థాన్ ప్రభుత్వ ప్రశంసలు అందుకోవాలని రైతు నాయకులు అనుకుంటున్నారా? అని నిలదీశారు.

ముజఫర్‌నగర్‌లో జరిగిన కిసాన్ మహాపంచాయత్‌కు సంబంధించి రేడియా పాకిస్థాన్ ట్వీట్ చేయడంపై కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఎన్నికలు వస్తున్నాయంటే ప్రతి ఒక్కరూ ర్యాలీలు తీస్తుంటారని, ఉత్తరప్రదేశ్‌లోనూ చాలా ర్యాలీలు ఉంటాయని, అయితే రైతు నేతలు ర్యాలీలు, ఆందోళనలతో పాకిస్థాన్ ప్రభుత్వ ప్రశంసలు అందుకోవాలనుకుంటున్నారా అని తాము ప్రశ్నించదలచుకున్నట్టు చెప్పారు.

 ”దేశ శత్రువులే మనను వ్యతిరేకిస్తుంటారు. మన ప్రత్యర్థులైన పాకిస్థాన్ తరహాలో ఈ నాయకులు (రైతు నేతలు) ఉండాలనుకుంటున్నారా? వాళ్లే ఆలోచించుకోవాలి” అని బల్వాన్ స్పష్టం చేశారు. సొంత ప్రచారం కోసం ఆందోళనలకు మద్దతిస్తున్నట్టు ప్రకటిస్తున్న రాజకీయ పార్టీల నేతల చేతుల్లో పావులుగా మారవద్దని రైతులకు హితవు చెప్పారు. 

మహాపంచాయత్‌లో వివిధ రాజకీయ పార్టీల జెండాలు, బ్యానర్లు కనిపించాయని చెబుతూ రైతులను ఎవరు ఎర్రకోటకు తీసుకువచ్చారో కూడా అందరికీ తెలుసునని కేంద్ర మంత్రి తెలిపారు. కాగా, మంగళవారం నిరసనలకు రైతు నాయకులు పిలుపు ఇవ్వడంతో కర్నల్ జిల్లా అధికారులు 144వ సెక్షన్ క్రింద నిషేదాజ్ఞలు విధించడంతో పాటు మొబైల్, ఇంటర్ నెట్ కనెక్షన్ లను కూడా నిలిపివేశారు. 

చ‌ట్టాన్ని ఉల్లంఘించిన వారికి న‌ష్ట‌ప‌రిహారం?

ఇలా ఉండగా,  హ‌ర్యానాలో క‌ర్నాల్ జిల్లా అధికారులు, భార‌తీయ కిసాన్ యూనియ‌న్ మ‌ధ్య సోమవారం సాయన్తరం జ‌రిగిన చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌య్యాయి. స‌మావేశం అనంత‌రం క‌ర్నాల్ జిల్లా క‌లెక్ట‌ర్ నిషాంత్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. రైతుల డిమాండ్ల‌లో న్యాయం లేదన్నారు. చ‌ట్టాన్ని ఉల్లంఘించిన వారికి న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వ‌లేమ‌ని స్పష్టం చేసారు.

లాఠీ చార్జి చేసిన త‌మ అధికారుల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోబోమ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. మంగళవారం రైతులు హైవేలను బ్లాక్ చేయ‌కుండా, మినీ సెక్రెటేరియ‌ట్‌ను ముట్ట‌డించ‌కుండా తాము అడ్డుకుంటామని చెప్పారు.

గ‌త నెల 28న క‌ర్నాల్‌లో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్న‌ రైతుల‌పై పోలీసులు లాఠీ చార్జి చేశారు. ఈ లాఠీ చార్జిలో 10 మంది రైతులు గాయ‌ప‌డ్డారు. ఈ లాఠీ చార్జికి నిర‌స‌న‌గా ఈ నెల 7న (మంగ‌ళ‌వారం) మహాపంచాయ‌త్ పేరుతో ర‌హ‌దారుల దిగ్బంధ‌నం, మిని సెక్రెటేరియ‌ట్ ముట్ట‌డి చేప‌ట్టాల‌ని రైతులు నిర్ణ‌యించారు.