నాలుగు వారాల తర్వాతే కోవిషీల్డ్‌ రెండు డోసు!

కోవిషీల్డ్ రెండో  డోసు తీసుకునేందుకు నాలుగు వారాల తర్వాత అనుమతించాలని కేరళ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ప్రభుత్వం అందించే ఉచిత టీకా కార్యక్రమానికి కాకుండా డబ్బులు చెల్లించి ప్రైవేటుగా టీకా తీసుకునేవారికి ఈ అవకాశం ఇవ్వాలని కోరింది. ఈ మేరకు కోవిన్‌ పోర్టల్‌లో మార్పులు చేయాలని సూచించింది. 

ప్రైవేట్ టీకాల కోసం, కరోనాపై ముందస్తు రక్షణ లేదా మెరుగైన రక్షణను ఎంచుకోవడానికి ప్రజలకు అర్హత ఉన్నదా అనేది తమ ప్రశ్న అని కోర్టు పేర్కొంది. కేరళలో కరోనా మరోసారి విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన కిటెక్స్ గార్మెంట్స్, కిటెక్స్ చిల్డ్రన్స్ వేర్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి.

తమ కంపెనీల్లో 10,000 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారని తెలిపాయి. కంపెనీ సిబ్బంది, కార్మికులు, వారి కుటుంబాలను కరోనా నుంచి రక్షించడానికి, ప్రభుత్వ ఉచిత టీకా కోసం ఎదురుచూడకుండా వారికి టీకాలు వేయడానికి రూ.52,30,680 వ్యయంతో వ్యాక్సిన్‌లు కొనుగోలు చేసినట్లు చెప్పాయి. ఉద్యోగులకు రెండవ డోస్ ఇవ్వడానికి 12,000 పైగా డోసులను కొనుగోలు చేసినట్లు వెల్లడించాయి.

అయితే కోవిన్‌లో టీకా కోసం నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉన్నందున, 12-16 వారాల గ్యాప్‌ నేపథ్యంలో తమ సిబ్బందికి వ్యాక్సిన్ రెండవ డోసు ఇవ్వలేకపోతున్నట్లు కోర్టుకు వివరించాయి. విద్యార్థులు, ఇతర దేశాలకు వెళ్లేవారు, ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు కోవిషీల్డ్‌ డోస్ గ్యాప్‌ను కేంద్రం సడలించిందని తమ పిటిషన్‌లో పేర్కొన్నాయి. ప్రభుత్వ అధికారులకు కూడా ఈ సౌకర్యం కల్పించినట్లు గుర్తు చేశాయి.

డబ్బులతో టీకాలు కొనుగోలు చేసిన తమకు కూడా గ్యాప్‌ సడలింపు ఇవ్వాలని ఆ కంపెనీలు కోర్టును అభ్యర్థించాయి. వారి పిటిషన్‌పై విచారణ జరిపిన కేరళ హైకోర్టు, డబ్బులు చెల్లించి ప్రైవేటుగా టీకా తీసుకునే వారికి కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ రెండో డోసును నాలుగు వారాల తర్వాత అనుమతించాలని కేంద్రాన్ని  ఆదేశించింది.

ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కరోనా టీకా భారతీయ వెర్షన్ కోవిషీల్డ్‌ను సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్నది. జనవరిలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించినప్పుడు ఈ టీకా రెండో డోసుకు నాలుగు నుండి ఆరు వారాల గ్యాప్‌ ఇచ్చారు. అనంతరం దీనిని ఆరు నుంచి ఎనిమిది వారాలకు పెంచారు. 

యూకేను అనుసరిస్తూ ప్రభుత్వం మే నెలలో కోవిషీల్డ్‌ రెండో డోసు గ్యాప్‌ను 12 నుంచి 16 వారాలకు సవరించింది. మరోవైపు భారత్ బయోటెక్ తయారు చేసి కోవాక్సిన్‌కు రెండో డోసు గడువు మారలేదు.